Begin typing your search above and press return to search.

బెలూన్ల ద్వారా సరుకు రవాణా... బెజవాడ స్టార్టప్ వినూత్న ఆవిష్కరణ!

యువత ఆలోచలకు ప్రోత్సాహమిస్తే సరికొత్త ఆవిష్కరణలకు కొదవ ఉండదని నిరూపించింది మంగళగిరిలో నిర్వహించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రదర్శన.

By:  Tupaki Desk   |   21 Aug 2025 11:14 AM IST
బెలూన్ల ద్వారా సరుకు రవాణా... బెజవాడ స్టార్టప్ వినూత్న ఆవిష్కరణ!
X

యువత ఆలోచలకు ప్రోత్సాహమిస్తే సరికొత్త ఆవిష్కరణలకు కొదవ ఉండదని నిరూపించింది మంగళగిరిలో నిర్వహించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రదర్శన. సరుకు రవాణాలో విప్లవాత్మక మార్పును తెచ్చే ఆలోచనకు కార్యరూపమిస్తూ బెజవాడకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ప్రతిపాదనను ఆవిష్కరించింది. లారీలు, రైళ్లు, విమానాలు, నౌకలు.. ఇలా ఇన్నాళ్లు సరుకు రవాణాకు ఉపయోగించే మార్గాలకు బదులుగా గాల్లో ఎగిరే బెలూన్ల ద్వారా సరుకులను చేరవేసే ప్రతిపాదన తీసుకువచ్చింది. బెలూన్ల ద్వారా అత్యంత చౌక ధరకే సరుకు రవాణా చేయొచ్చని చెబుతోంది. దీనిద్వారా దేశంలో రవాణా విప్లవం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటివరకు రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల ద్వారా సరుకులను రవాణా చేస్తున్నారు. దీని ద్వారా ఎంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అయితే ఎయిర్ బస్ పరిణామానికి మూడింతల పెద్దదైన హైడ్రోజన్ బెలూన్ ద్వారా సరుకులు రవాణా చేయొచ్చని విజయవాడకు చెందిన రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదిస్తోంది. హెలిక్స్ పేరుతో కార్గో బెలూన్లను ఆ సంస్థ రూపొందిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే ఈ ఎయిర్ బెలూన్లు 2029 కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే ఇలాంటి బెలూన్లు దేశీయంగా తయారు చేయడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. వాణిజ్య, రక్షణ అవసరాల కోసం వీటిని అభివృద్ధి చేస్తున్నారు. బుధవారం మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టార్టప్ స్టాల్స్ లో రెడ్ బెలూన్ ఫార్ములాను ప్రదర్శించారు. స్టాల్ లో విమానం ఆకారంలో ఉన్న తెల్లటి బెలూన్ అందరిని ఆకర్షించింది. అంతరిక్ష రంగంలో పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న డాక్టర్ సవీఎస్ కిరణ్, పల్లికొండ శిరీష్ రెడ్ బెలూన్ సంస్థను స్థాపించారు.

సహజంగా ఎయిర్ బస్ విమానం చాలా పెద్దదిగా ఉంటుంది. దీనికి మూడింతల సైజులో కార్గో బెలూన్ ఉంటుందని చెబుతున్నారు. అతి తక్కువ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కార్గో బెలూన్లను నిర్వహించవచ్చు. రవాణా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతాలకు సులువుగా సరుకులు రవాణా చేయవచ్చని సంస్థ ప్రతినిధులు కిరణ్, శిరీష్ మీడియాకు వివరించారు. ఈ బెలూన్లను రిమోట్ సాయంతో 20 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో వస్తువులను చేరవేయచ్చని చెబుతున్నారు. కిలో బరువుకు రూ.80 నుంచి రూ.100 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. రైలు, రోడ్డు రవాణా కంటే తక్కువ వ్యయం అవుతుందని వారు వెల్లడించారు.