Begin typing your search above and press return to search.

ఏంది ఓట్ల వరద? బెంగాల్ లో 92.7%..తమిళనాడులో 85.1%

డ్రాయింగ్ రూంలో కూర్చొని విశ్లేషణలు చేయటం.. కష్టం వచ్చినప్పుడు మైకుల ముందు చెలరేగిపోవటానికి మించింది మరొకటి ఉంది.

By:  Tupaki Desk   |   24 April 2026 12:36 PM IST
ఏంది ఓట్ల వరద? బెంగాల్ లో 92.7%..తమిళనాడులో 85.1%
X

డ్రాయింగ్ రూంలో కూర్చొని విశ్లేషణలు చేయటం.. కష్టం వచ్చినప్పుడు మైకుల ముందు చెలరేగిపోవటానికి మించింది మరొకటి ఉంది. ఎన్నికల పోలింగ్ వేళ.. ఎవరికి వారు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్త పరిస్తే మార్పు దానంతట అదే వస్తుంది. తాజాగా జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గురువారం పోలింగ్ పూర్తైన సందర్భంగా బెంగాల్ ఓటర్లు.. తమిళనాడు ఓటర్లు హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రజాస్వామ్య భారతంలో ప్రభంజనంలా పోలింగ్ కేంద్రాలకు కదిలి వచ్చి.. తమ ఓటుహక్కును వినియోగించటం ద్వారా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఈ కారణంగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైన పరిస్థితి.

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 23 జిల్లాలు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గాలు 294. తొలిదశలో 16 జిల్లాల్లో 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. అంటే.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిదశలో 51.7 శాతానికి పైగా నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తైంది. బెంగాల్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అధికారిక రికార్డుల ప్రకారం మొదటిదశ పోలింగ్ 92.7 శాతంగా నమోదైంది. అంటే.. 93 శాతంగా చెప్పొచ్చు. ప్రజాస్వామ్య భారతంలో ఇటీవల కాలంలో ఇంత భారీగా పోలింగ్ నమోదైన ఎన్నికలుగా చెప్పొచ్చు.

2011, 2016.. 2021లోనూ 80 నుంచి 85 శాతం పోలింగ్ నమోదైనా.. ఈసారి అంతకు మించి అన్నట్లు 90 శాతాన్ని దాటేయటమే కాదు.. అంతకు మించిన అన్నట్లుగా పోలింగ్ జరటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ బెంగాల్ లో ఇంత భారీగా పోలింగ్ జరగటానికి కారణాల్ని చూస్తే..

- అధికార టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్).. బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ. ఈ ఎన్నికల్ని ఈ రెండు పార్టీలు చావో రేవో అన్నట్లుగా పోరాడటం.. తమ శక్తి మొత్తాన్ని ఖర్చు చేసి.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావటం కూడా ఇంత భారీగా పోలింగ్ నమోదు కావటానికి కారణంగా చెప్పొచ్చు.

- హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో బెంగాల్ మహిళలు కీలక భూమిక పోషించారు. సంక్షేమ పథకాలు.. భద్రత లాంటి అంశాలతోమహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయటానికి ఆసక్తి చూపారు.

- ఈసారి ఎన్నికల్లో పొలిటికల్ పోలరైజేషన్ భారీగా జరిగినట్లు చెబుతున్నారు. దీంతో.. భావజాలం పరంగా భిన్న ధ్రువాలుగా నిలిచే.. టీఎంసీ.. బీజేపీ క్యాడర్ ఎన్నికల్లో గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించటం..భారీ పోలింగ్ కు కారణమైంది.

- తొలిదశలో జరిగిన పోలింగ్ అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగింది. సాధారణంగా పట్టణ ప్రాంతాల ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవటానికి ఆసక్తి చూపుతారు. ఇది కూడా భారీ పోలింగ్ కు కారణమైంది.

- మరో ఐదు రోజుల్లో (ఏప్రిల్ 29) రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందులో పోలింగ్ శాతం నమోదు ఆధారంగా తుది పోలింగ్ శాతం లెక్క తేలనుంది. రెండో దశ పోలింగ్ పట్టణ ప్రాంతాల్లో జరగనున్న నేపథ్యంలో.. ఆ మేరకు పోలింగ్ తగ్గితే.. మాత్రం ఇప్పుడున్న రికార్డు పోలింగ్ మాట మారే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

తమిళనాడు

పశ్చిమబెంగాల్ లో మాదిరి కాకుండా తమిళనాడులో ఒక దశలోనే ఎన్నికల పోలింగ్ పూర్తైంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 38 జిల్లాలు ఉన్నాయి. ఒకే విడతలో పోలింగ్ పూర్తి కావటంతో.. తుది ఫలితం కోసం దాదాపు పది రోజులకు పైనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 85.1 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడు చరిత్రలో సాధారణంగా 70 నుంచి 75 శాతం వరకు మాత్రమే పోలింగ్ జరిగింది.

1967లో అత్యధికంగా 76.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. తాజాగా అంతకు మించి అన్నట్లు ఏకంగా పదిశాతం ఎక్కువ పోలింగ్ నమోదైంది. కాకుంటే.. బెంగాల్ లో 90 శాతానికిమించి పోలింగ్ నమోదు కావటంతో తమిళనాడులో నమోదైన పోలింగ్ తక్కువగా కనిపించకపోవచ్చు. కానీ.. తమిళనాడురాష్ట్ర ఎన్నికల చరిత్రనుచూస్తే.. ఇదే అత్యధికం కావటం గమనార్హం. ఇంతకూ ఇంత భారీగా పోలింగ్ నమోదు కావటానికి కారణాల్ని చూస్తే..

- ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారిన విజయ్.. స్టాలిన్.. అన్నామలై పుణ్యమా అని ఎన్నికల పోలింగ్ శాతం పెరగటానికి దారి తీసింది.

- ముగ్గురు ముగ్గురే అన్నట్లుగా భిన్నమైన భావజాలానికి ప్రతీకలుగా నిలిచిన ఈ ముగ్గురు ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేశారు

- ద్రవిడ పార్టీల మధ్య ఉండే సుదీర్ఘ పోరు.. కొత్త పార్టీ(విజయ్) రాక కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు పోటెత్తేలా చేసింది.

- రాజకీయ పార్టీలమధ్య ఉన్న హోరాహోరీ పోరు.. ఈ ఎన్నికల్ని ఎవరికి వారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. ఆయాపార్టీల క్యాడర్లు పెద్ద ఎత్తున శ్రమించటం.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున వచ్చేందుకు కారణమైంది.