Begin typing your search above and press return to search.

మాంద్యం ముంచుకొస్తోందా? 18 సంపన్న దేశాల్లో టెన్షన్

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నెమ్మది నెమ్మదిగా మాంద్యం దిశగా వెళ్లేలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:24 AM GMT
మాంద్యం ముంచుకొస్తోందా? 18 సంపన్న దేశాల్లో టెన్షన్
X

మాంద్యం ముంచుకొస్తుందా? అంటే అవునంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నెమ్మది నెమ్మదిగా మాంద్యం దిశగా వెళ్లేలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బలమైన ఆర్థిక వ్యవస్థలుగా పేరున్న దేశాల్లో పరిస్థితి ఏమాత్రం సరిగా లేదు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న జపాన్ నాలుగో స్థానానికి దిగజారంటం ఒక ఎత్తు అయితే.. సంపన్న దేశాల్లో బలమైన బ్రిటన్ సైతం టెక్నికల్ గా మాంద్యంలోకి జారుకుంటుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తాజాగా విడుదలైన జాబితాలో పద్దెనిమిది సంపన్న దేశాల్లోనూ మాంద్యం ఛాయలు ముసురుకుంటున్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే.. ముంచుకొచ్చే మాంద్యం సినిమాకు శాంపిల్ ట్రైలర్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోందని చెబుతున్నారు. పదుల దేశాలు తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకులతో సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం మరో 18 దేశాలు మాంద్యం జాబితాలోకి చేరటం కనిపిస్తోంది. ఇందులో అత్యధికం యూరోపియన్ దేశాలే కావటం గమనార్హం.

ఇంతకూ మాంద్యం అని ఎలా చెబుతారు? అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తిలో(అదేనండి జీడీపీ)లో తగ్గుదల నమోదైతే దాన్ని మాంద్యం కింద లెక్కేస్తారు. 2023 డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్.. బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావటంతో దాని ప్రభావం మిగిలిన దేశాల మీద పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలకు ఈ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.

సంపన్న దేశంగా పేరున్న ఐర్లాండ్ సంగతే చూస్తే.. ఆ దేశ జీడీపీ మూడో త్రైమాసికంలో 0.7 శాతం తగ్గగా.. నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే 1.9 శాతం తగ్గుదల నమోదు చేసింది. .మరో నెల రోజుల వ్యవధిలో మరెంత తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి. ఫిన్లండ్ జీడీపీ వరుసగా 0.4, 0.9 శాతం తగ్గుదల నమోదైంది. ఇలాంటి పరిస్థితి యూరోప్ లోని చాలా దేశాల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలా దేశాల నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడైతే.. మాంద్యం బారిన పడిన దేశాల జాబితా మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

తాజాగా జీడీపీ తగ్గుదల జాబితాలో చేరిన దేశాల్లో ఆరు ఈసారే చేరటం గమనార్హం. జీడీపీలో తగ్గుదల నమోదు చేస్తున్న దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువగా యూరోపియన్ దేశాల ఉండటంతో యూరోప్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఫ్రాన్స్ సైతం మాంద్యం బాట పడుతున్న సంకేతాలు వెలువుతున్నాయి. కింద పేర్కొన్న దేశాల జీడీపీ తగ్గుదల శాతానికి సంబంధించిన గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో.. నాలుగో త్రైమాసికానికి సంబంధించినవి కావటం గమనార్హం.

దేశం జీడీపీలో తగ్గుదల (శాతం)

ఐస్ లాండ్ 3.8

బహ్రెయిన్ 2.4

మలేసియా 2.1

ఐర్లండ్ 1.9

ఎస్టోనియా 1.3

ఈక్వెడార్ 1.3

ఫిన్ లాండ్ 0.9

జపాన్ 0.8

మాల్డోవా 0.8

డెన్మార్క్ 0.7

థాయ్ లాండ్ 0.6

రొమేనియా 0.4

కెనడా 0.3

న్యూజిలాండ్ 0.3

లిథువేనియా 0.3

జర్మనీ 0.3

కొలంబియా 0.2

దక్షిణాఫ్రికా 0.2

లగ్జెంబర్గ్ 0.1

బ్రిటన్ 0.1