Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఓటమికి.. మగధీర డైలాగ్ లింక్.. వరుస అపశకునాలు!

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తాజా పరాజయం.. తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమా మగధీర సినిమాలోని ఫేమస్ డైలాగ్ ను గుర్తుకు తెస్తోందా..?

By:  Tupaki Desk   |   5 Dec 2023 12:30 AM GMT
బీఆర్ఎస్ ఓటమికి.. మగధీర డైలాగ్ లింక్.. వరుస అపశకునాలు!
X

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తాజా పరాజయం.. తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమా మగధీర సినిమాలోని ఫేమస్ డైలాగ్ ను గుర్తుకు తెస్తోందా..? ఓ విధంగా చూస్తే ఔననే అనిపిస్తోంది కూడా. మగధీరలో హీరో-విలన్ ఎదురుపడిన సందర్భంలో తలెత్తే విపత్తుల గురించి రావు రమేశ్ వివరిస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పరాజయానికి ముందు అన్నీ అపశకునాలే కనిపించాయి.

కాళేశ్వరం కుంగింది..

బీఆర్ఎస్ 2018లో ఎంతో గొప్పగా చెబుతూ ఎన్నికలకు వెళ్లిన ప్రాజెక్టు కాళేశ్వరం. నాడు ఓ విధంగా ఇది అధికారం కట్టబెట్టింది కూడా. అదే ప్రాజెక్టు ఈసారి సరిగ్గా ఎన్నికల సమయంలో కుంగింది. అన్నారంలోనూ లోపాలు బయటపడ్డాయి. వీటిని ఎంత సమర్థించుకోవాలని చూసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రజల్లోకి రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు దెబ్బతిన్నది అనే అభిప్రాయం వెళ్లిపోయింది.

పేపర్ లీక్ లు.. నిరుద్యోగుల ఆత్మహత్యలు

నీళ్లు, నిధులు, నియామకం డిమాండ్ తో సాగిన తెలంగాణ ఉద్యమంలో నీళ్లు (మేడిగడ్డ) కాకుండా రెండో ప్రాధాన్యం అంశం నియామకాలు. తెలంగాణ ఏర్పడ్డాక తొమ్మిదేళ్లకు గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ నిర్వహిస్తే పేపర్ లీక్ తో రద్దయింది. మరోసారి చిన్న తప్పిదంతో రద్దయింది. ఇక నిరుద్యోగుల ఆత్మహత్యలు మరింత చేటు తెచ్చాయి. చివరగా ప్రవళిక అనే అభ్యర్థిని ఆత్మహత్య అత్యంత వివాదమైంది.

కలిసిరాని రాజకీయ ఎత్తులు

2018లో చంద్రబాబును చూపించి సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ధి పొందింది బీఆర్ఎస్. ఈ సారి ఎన్నికల సమయానికి చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. అయితే, ఆయన అరెస్టు సందర్భంగా ఐటీ ఉద్యోగుల ఆందోళనలను తప్పుబట్టడం చేటు చేసింది. మరోవైపు వామపక్షాలను మునుగోడు ఉప ఎన్నికకు వాడుకుని వదిలేయడం నైతికంగా ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఈటల రాజేందర్, పొంగులేటి, తుమ్మల వంటి కీలక నాయకులు చాలామంది దూరమయ్యారు.

నిధులు.. అప్పులు..

తెలంగాణ ఉద్యమంలో మూడో అంశం నిధులు. తెలంగాణ మిగులు రాష్ట్రమని.. ధనిక రాష్ట్రమని ఆవిర్భావ సమయంలో కేసీఆర్ గొప్పగా చెప్పారు. అలాంటిది తొమ్మిదిన్నరేళ్ల తర్వాత చూస్తే రూ.5 లక్షల కోట్ల అప్పు మిగిలింది. ఇంత అప్పు ఎందుకయిందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ లోని భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక భూములను అమ్మకానికి పెట్టింది.

పథకాలు పటాటోపం

హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటలను ఓడించడానికి దళిత బంధు పథకం తేవడం.. దాని అమలుకు ఆపసోపాలు పడడం బీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. ఎన్నికల ముంగిట బీసీలకు రూ.లక్ష సాయం అంటూ హడావుడితో కొద్దిమందికే ఇవ్వగలిగారు. రైతు బంధు డబ్బులు ఏటా డిసెంబరులో వేసేవారు. ఈసారి అక్టోబరు-నవంబరులోనే ఇవ్వబోయి ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఆగిపోయారు. ఇలా చెప్పుకొంటూ అనేక లోటుపాట్లు. అయితే, సరిగ్గా ఇవన్న ఎన్నికల ఏడాదిలోనే బయటపడడం బీఆర్ఎస్ పరాజయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పక తప్పదు.