Begin typing your search above and press return to search.

పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లింది అందుకోసమా?

ఈ మొత్తం ఎపిసోడ్ ను సింఫుల్ గా రెండు ముక్కల్లో చెప్పాలంటే.. పవన్ పెద్ద మనసు ఆవిష్క్రతమైతే.. కొడుకు మీద చంద్రబాబుకు ఉండే ఆరాటం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 4:11 AM GMT
పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లింది అందుకోసమా?
X

రాజకీయాల్లో ఏదీ ఉత్తినే జరగదు. ప్రతిదాని వెనుకా ఏదో ఒక లెక్క ఉంటుంది. పదేళ్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లని చంద్రబాబు.. తాజాగా మాత్రం ఉరుము మెరుపు లేని రీతిలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వెళ్లటం ఆశ్చర్యానికి గురి చేసింది. రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో.. రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లుగా.. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న ప్రాధమిక చర్చ జరిగినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. అసలు కారణం వేరే ఉందన్న విషయం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.

ఈ మొత్తం ఎపిసోడ్ ను సింఫుల్ గా రెండు ముక్కల్లో చెప్పాలంటే.. పవన్ పెద్ద మనసు ఆవిష్క్రతమైతే.. కొడుకు మీద చంద్రబాబుకు ఉండే ఆరాటం బయటకు వచ్చింది. లోకేశ్ పాదయాత్ర ముగింపునకు వచ్చేయటం.. యువగళం పేరుతో ఆయన నిర్వహించిన పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని విశాఖలో భారీగా నిర్వహిస్తున్న వేళ.. ఆ సభకు పవన్ కల్యాణ్ కూడా తమ వెంట ఉంటే దాంతో వచ్చే జనబలం లెక్కలు వేరుగా ఉంటాయన్న చంద్రబాబు ఆలోచనకు జనసేనాని ముందు వెనుకా ఆలోచించకుండా ఓకే చెప్పేయటం కనిపిస్తుంది.

స్నేహానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసే పవన్ కల్యాణ్ కు అడిగింది ఏదైనా సరే.. ఇచ్చే గుణమే తప్పించి.. లాభనష్టాలు లాంటి వాటిని అస్సలు పట్టించుకోరు. చంద్రబాబు తన ఇంటికి స్వయంగా వచ్చి.. తన కొడుకు కోసం అడిగారన్న ఒక్క మాటకు ఆయన సానుకూలంగా స్పందించే గుణం ఉంటుందని చెబుతారు. ఇదేమీ తప్పు కాదు. కాకుంటే.. కొడుకు కోసం కాకుండా పవన్ కోసం కూడా ఇలానే చంద్రబాబు ఆయన ఇంటికి వెళితే బాగుండేదన్నది సగటు పవన్ అభిమానుల అకాంక్ష.

తాజా ఎపిసోడ్ లో పవన్ నిండు మనసు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెబుతారు. ఏమైనా.. ఇంటికి వచ్చిన చంద్రబాబుకు నిండు మనసుతో విశాఖసభకు తన రాక అనే గిఫ్టును ఇచ్చి పంపినట్లుగా చెబుతారు. ఇదంతా ఎలా చెప్పారన్న మాటకు లాజిక్ లేకపోలేదు. పవన్ ఇంటికి వెళ్లటానికి ముందు వరకు యువగళం ముగింపు సందర్బంగా నిర్వహించే కార్యక్రమానికి చంద్రబాబు.. బాలయ్యలు మాత్రమే అతిధులుగా హాజరయ్యేలా ప్రకటనల్ని రూపొందించారు. ఆదివారం రాత్రి పవన్ ఓకే అన్న తర్వాత నుంచి.. సభకు పవన్ కూడా రానున్నట్లుగా చెప్పే కొత్త ప్రకటనల్ని యుద్ధ ప్రాతిపదికన తెర మీదకు తీసుకురావటమే దీనికి నిదర్శనంగా చెప్పాలి.

"రండి.. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవ్వండి. ఒకే వేదికపై తిరుగులేని ప్రజా నాయకుల అపూర్వ సంగమం. విశాఖలో యువగళం.. నవశకం కార్యక్రమ వేదికపై తెలుగుదేశం.. జనసేన అధినేతలు" అంటూ పిలుపునిచ్చారు. లోకేశ్ యువగళం ముగింపు వేళ.. అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారని చెప్పాలి. ఈ మొత్తం ఉదంతంలో మరోసారి పవన్ పెద్ద మనసు ఫ్రూవ్ అయ్యిందన్నమాట వినిపిస్తోంది.