'భార్య బిడ్డలతో బ్రతకాలని ఆశ ఉంది కానీ'... రియల్టర్ ఆత్మహత్య!
అవును... అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేంద్రప్రసాద్ (50) ఆత్మహత్య చేసుకున్నారు.
By: Tupaki Desk | 2 July 2025 10:16 PM IST"బ్రతకాలని ఆశ ఉంది.. భార్య పిల్లలతో బ్రతకాలని ఆశ ఉంది.. సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఆశ ఉంది.. ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నా.. ఏమారుతూ మోసపోతున్నా.. అప్పులపాలైపోయాను.. ఏదో అనుకుంటే ఏదో అయిపోయాను.. నా బిడ్డకు తోడుగా ఉండాల్సిన వాడిని.. నా బిడ్డకు శాపంగా మారి చనిపోవాలనుకుంటున్నా" అంటూ ఓ రియల్టర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అవును... అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేంద్రప్రసాద్ (50) ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకొని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అమ్మినేని వీధికి చెందిన రాజేంద్రప్రసాద్ కు భార్య, కుమార్తె ఉన్నారు. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆయన... రియల్ వ్యాపారంలో నష్టాలతో అప్పులు చేశారు.
ఫలితంగా.. అధిక వడ్డీలతో ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయారు. వడ్డీలు కట్టాలంటూ డబ్బు ఇచ్చినవారు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు! దీంతో.. చేసిన అప్పులు తీర్చలేక, కనీసం వడ్డీలు కట్టలేక మనస్తాపానికి గురైన రాజేంద్రప్రసాద్.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు!
"ఈ పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. ఇది వరకూ ఒకసారి వచ్చింది, ఏదో బ్రతికేశాను. ఇప్పుడు పూర్తిగా బ్రతకనిచ్చే అవకాశం కనిపించడం లేదు.. బ్రతకాలని చాలా కోరిక ఉంది.. నా చావు వల్ల కొందరికి అన్యాయం జరుగుతుంది.. కొందరు బాగుపడిపోతారు.. వడ్డీలు కట్టలేకపోతున్నా.. అధిక వడ్డీలు, వడ్డీల మీద వడ్డీ.." అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో... రాజేంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన స్థానికులు రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో... పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
