Begin typing your search above and press return to search.

అయోధ్యలో రియల్ బూమ్... షాకింగ్ గా నిపుణుల అంచనాలు!

ప్రధానంగా సోమవారం అయోధ్యలో నవనిర్మిత రామందరంలో రాం లల్లా ప్రాణప్రతిష్ఠ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Jan 2024 2:45 AM GMT
అయోధ్యలో రియల్  బూమ్... షాకింగ్  గా నిపుణుల అంచనాలు!
X

ప్రస్తుతం భారతదేశంలో ఎటు చూసినా అయోధ్య రామ మందిరం గురించిన చర్చే జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సోమవారం అయోధ్యలో నవనిర్మిత రామందరంలో రాం లల్లా ప్రాణప్రతిష్ఠ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు అయోధ్య అనేది టూరిజంగా అత్యంత హాట్ టాపిక్ అని.. ఏడాదికి కోట్లలో టూరిస్టులు అయోధ్యకు క్యూకట్టే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు రియల్ బూమ్ కూడా చర్చనీయాంశం అయ్యింది.

అవును... తాజాగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అవ్వడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌ లో ఆస్తులకు అసమానమైన డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. ఫలితంగా భూముల ధరలు వేరే లెవెల్ కి చేరబోతున్నాయని అంటున్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రతీరోజూ లక్షలాది మంది భక్తులు సందర్శించడం వల్ల అయోధ్యలో ఆస్తి రేట్లు 12 నుంచి 20 రెట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 5-10 రెట్లు పెరిగాయని చెబుతున్నారు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన స్క్వేర్ యార్డ్స్ సేల్స్ డైరెక్టర్ రవి నిర్వాల్... ఆలయ స్థలం నుంచి 5-10 కి.మీల పరిధిలో చ.అ.కు రూ. 2000 నుండి సుమారు రూ.20000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని.. ఇది భారీ పెరుగుదలే అని చెబుతున్నారు. ఇదే క్రమంలో... టెంపుల్ సిటీ ప్రారంభోత్సవం తర్వాత లక్షలాది మంది సందర్శకులు వస్తారని అంచనా వేయడంతో, రాబోయే దశాబ్దంలో ధరలు 12-20 రెట్లు పెరగవచ్చని వెల్లడించారు.

ఇదే సమయంలో దేశీయంగానే కాకుండా... అంతర్జాతీయంగా కూడా పెట్టుబడిదారులు ఆలయ స్థలానికి సమీపంలో విలువైన భూములను కొనుగోలు చేస్తున్నారని నిర్వాల్ తెలిపారు. ఇటీవలి విమానాశ్రయం ఏర్పాటుతో ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత జోరందుకుందని.. కొన్ని జోన్లలో ఆస్తుల ధరలు దాదాపు భరించలేని స్థాయికి చేరుకున్నాయని తెలిపారు.

ఇక అయోధ్య రామాలయానికి 5-15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చౌదా కోసి పరిక్రమ, రింగ్ రోడ్, డియోకలి, నయా ఘాట్ ప్రాంతాలు కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి అనువైన ప్రధాన ప్రదేశాలని.. ఇదే సమయంలో అదనంగా గోరఖ్‌ పూర్ ఫైజాబాద్ హైవే వెంబడి కూడా పెట్టుబడి కార్యకలాపాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. దీంతో... హైదరాబాద్ ని తలదన్నేలా అయోధ్యలో రియల్ బూమ్ మారిపోయిందని అంటున్నారు నిపుణులు!!