రియల్ హీరో రాయిస్ అహ్మద్ భట్.. పలువురు ప్రాణాలు కాపాడారు
ఇతను పహల్గాంలో పోనీ ఓనర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 27 April 2025 4:25 AMఒక మతస్తులంతా ఒకేలాంటోళ్లు అన్న ముద్ర వేయటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇప్పుడున్న భావోద్వేగ పరిస్థితుల్లో సున్నిత అంశాల్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినా తప్పుగా చూస్తారు. అయితే.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం పాత్రికేయుడి బాధ్యత. ఒకరి తప్పును అందరికి అపాదించలేం. అలా అని ఆ తప్పును తప్పులు చేసిన వారి నుంచి మినహాయించలేం. సింఫుల్ గా చెప్పాలంటే.. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పలువురి అమాయకుల ప్రాణాల్నితీసింది ఉగ్రవాదులు. అయితే.. వారు అనుసరించే మతం ఇస్లాం. అంత మాత్రాన.. అందరూ అలానే ఉంటారన్న భావన సరికాదు. ఎందుకుంటే.. ఉగ్రవాదుల బారి నుంచి ప్రాణాల్నికాపాడిన వారు ముస్లింలే. ఒక విషయంలో నెగిటివిటీని అపాదించేందుకు వెనుకాడనప్పుడు.. పాజిటివ్ అంశాల్ని ప్రస్తావించటం ధర్మమే అవుతుంది కదా?
మొత్తంగా చెప్పేదేమంటే.. మతం పేరుతో విభజన చేసే కన్నా.. సదరు మతంలో చెడ్డోళ్లు.. మంచోళ్లు ఉన్నారన్నది మర్చిపోకూడదు. అంతేకాదు.. ప్రాణాలు తీసిన వారి ఉదంతాలను అదే పనిగా చెప్పి.. ఒక మత వర్గీయుల మీద ఆగ్రహాన్ని పెంచే వేళ.. వాస్తవంగా ఉగ్రదాడి జరిగిన వేళలో.. అక్కడి స్థానిక ముస్లింలు పర్యాటకుల ప్రాణాల్ని కాపాడేందుకు ఎంతలా తల్లడిల్లారో.. మరెంతలా తపించారన్న విషయానని గుర్తించాల్సిన బాధ్యత ఉంది.
పహల్గాం ఉగ్రదాడి నుంచి దాదాపు పది నుంచి పదిహేను మంది పర్యాటకుల్ని రక్షించిన వైనం వెలుగు చూసింది. ఈ రియల్ హీరో పేరు రాయిస్ అహ్మద్ భట్. ఇతను పహల్గాంలో పోనీ ఓనర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రదాడిని తన కళ్లతో చూడటమే కాదు.. పలువురిని ప్రాణాలతో రక్షించిన గొప్పతనం ఇతని సొంతం. ఆ రోజు అసలే జరిగింది? అన్న ప్రశ్నకు నాటి దారుణ ఉదంతాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. అతనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చదివితే..
‘‘టెర్రర్ అటాక్ అన్నది మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో జరిగింది. అప్పుడు నేను ఆఫీసులో ఉన్నా. నా ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ మా యూనియన్ జనరల్ ప్రెసిడెంట్ నుంచి వచ్చింది. ఆ మెసేజ్ చేసిన తర్వాత ఫోన్ కాల్ చేసేందుకు ప్రయత్నించా. సెల్ సిగ్నల్స్ సరిగా లేకపోవటంతో ఆఫీసు నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నా. అప్పుడు ఉగ్రదాడి జరుగుతుందన్న విషయాన్ని గుర్తించా. నేను.. మా ఆఫీసులో ఉన్న ఆరుగురిని తీసుకొని అక్కడి నుంచి కొందరిని మాతో తీసుకెళ్లాం’’ అని చెప్పుకొచ్చారు.
పైకి వెళ్లిన తర్వాత కిందకు చూస్తే.. భయానక సన్నివేశాలు కనిపించాయన్న రాయిస్ అహ్మద్.. ‘‘ఆ ఘటనను గుర్తు చేసుకుంటే ఒళ్లంతా అదురుతోంది. ఉగ్రదాడి వేళ భయంతో పరుగులు పెడుతున్న వారు.. రక్షించాలన్న ఆర్తనాదాలే వినిపించాయి. కొందరు నీళ్ల కోసం కేకలు వేస్తూ పరుగులు తీస్తున్నారు. నేను వారికి సాయం చేసేందుకు ప్రయత్నించా. అడవిలో ఉన్న ఒక వాటర్ పైప్ సాయంతో నీళ్లు ఇచ్చా. భయంతో ఉన్న వారికి నేను ఒక్కటే చెప్పాను. వారంతా సురక్షితంగా ఉన్నారని. యాత్రికుల్ని కొందరిని నా టీం సభ్యులకు అప్పగించా. భయపడిన వారిని సురక్షితంగా బయట పడేలా చేయటమే నా మొదటి పనిగా భావించా’’ అని ఆ టైంలో తానేం చేశాడో చెప్పుకొచ్చాడు రాయిస్ అహ్మద్ భట్.
కాల్పుల వైపు తాను తొలిసారి చూసినప్పుడు.. ఎంట్రన్స్ గేటు వద్ద ఒక డెడ్ బాడీని తాను చూసినట్లుగా చెప్పిన భట్.. ‘‘ఆ తర్వాత నాలుగైదు డెడ్ బాడీలు కనిపించాయి.అక్కడ ఉన్న కొంతమంది గాయపడ్డ మహిళలు.. తమ భర్తలను రక్షించాలని వేడుకున్నారు. ఏదైతే అది అవుతుందని మా టీం సభ్యులమంతా గేట్ లోపలకు వెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేశాం. అలా పది.. పదిహేనను మందిమి రక్షించగలిగాం’ అని చెప్పుకొచ్చారు.