Begin typing your search above and press return to search.

వైసీపీలో ఆర్సీపురం ఇష్యూ... అలా సర్ధుబాటు చేసిన జగన్!

ఇందులో భాగంగా ఇప్పటికే 11 మంది ఇన్ ఛార్జ్ లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 5:24 AM GMT
వైసీపీలో ఆర్సీపురం ఇష్యూ... అలా సర్ధుబాటు చేసిన జగన్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార పక్షంలో అభ్యర్థుల విషయంలో తీవ్రస్థాయిలో ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 11 మంది ఇన్ ఛార్జ్ లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో ఇటీవల కాలంలో కాస్త రచ్చ రచ్చగా మారిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ టిక్కెట్ విషయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ చెల్లుబోయిన వేణు వ్యవహారాన్ని జగన్ కూల్ చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా పిల్లి గౌరవాన్ని కాపాడారని అంటున్నారు.

అవును... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గీయుల మధ్య సీటు విషయంలో రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇద్దరూ ఓకే సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో.. ఈ ఇష్యూని చక్కబెట్టకపోతే పెద్ద సమస్యలే వస్తాయనే కామెంట్లు వినిపించాయి.

ఆ సమయంలో పిల్లి సుభాష్ వర్గాన్ని పక్కన పెట్టి రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణు రాజకీయం చేస్తున్నారనే కామెంట్లు వినిపించాయి. ఆ టిక్కెట్ వేణుదే అంటూ ఆయన అనుచరులు హల్ చల్ చేయడం మొదలుపెట్టారనే మాటలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన పిల్లి వర్గం నాయకులు గతంలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. దీంతో నియోజకవర్గంలో కొత్త సమస్య అనే కామెంట్లు వినిపించాయి.

ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో చెల్లుబోయిన వేణుకు మళ్లీ టీకెట్ ఇస్తే కచ్చితంగా ఓడించి తీరుతామని సుభాష్ వర్గీయులు సవాల్లు విసిరారు. ఈ క్రమంలో... పిల్లి సుభాష్ చంద్రబోస్ కి కానీ.. ఆయన కొడుకు సూర్యప్రకాష్ కు గానీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో జగన్ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. ఇందులో భాగంగా పిల్లి సుభాష్ ను వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడారు.

అనంతరం తిరిగి నియోజకవర్గానికి వచ్చిన సుభాష్ చంద్రబోస్... ఈసారి ఎన్నికల్లో తాను గానీ, తన కొడుకు గానీ ఎమ్మెల్యేగా పోటీచేసి తీరుతాం అని మరోసారి ప్రకటించారు. అయితే తాజాగా ఆ ప్రకటనే నిజమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గం టిక్కెట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ కే కన్ ఫాం చేశారని తెలుస్తుంది.

ఈ సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కు రాజమండ్రి రూరల్ టిక్కెట్ కన్ ఫాం చేశారని అంటున్నారు. దీంతో ఆర్సీపురంలో చెల్లుబోయిన వర్గాన్ని పిల్లి సుభాష్ వర్గం ఎలా కలుపుకుపోతుందనేది ఆసక్తిగా మారింది. వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం అని వైసీపీ అధిష్టాణం పదే పదే చెబుతున్న నేపథ్యంలో... ఆ మాటలకు ఆర్సీపురంలో చెల్లుబోయిన వర్గీయులు వింటారనే తెలుస్తుంది!

ఏది ఏమైనా... ఒకప్పుడు రచ్చ రచ్చగా మారిన ఆర్సీపురం వైసీపీ టిక్కెట్ ను జగన్ టీకప్పులో తుఫానుగా మార్చేశారనే అనుకోవాలి. ఇక కార్యకర్తలంతా ఏకతాటిపైకి రావడమే బాకీ!