Begin typing your search above and press return to search.

చిన్నస్వామి దుర్ఘటన.. పోయినవన్నీ నవ యువ ప్రాణాలు

సహజంగా క్రికెట్ ను అభిమానించేది యువతే. వీరిలోనూ విరాట్ కోహ్లికి ఫ్యాన్స్ ఎక్కువ. ఇక బెంగళూరు అంటే భారత టెక్ రాజధాని.

By:  Tupaki Desk   |   5 Jun 2025 2:48 PM IST
చిన్నస్వామి దుర్ఘటన.. పోయినవన్నీ నవ యువ ప్రాణాలు
X

అభిమాన జట్టు ఎట్టకేలకు టైటిల్ గెలిచిందన్న అభిమానం.. ఇష్టమైన ఆటగాళ్లను కళ్లారా చూడాలనే ఆశ.. విజయోత్సవంలో తామూ భాగం కావాలన్న ఉత్సాహం.. ఆ నవ యువ ప్రాణాలను బలిగొంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఎదుట బుధవారం చోటు చేసుకున్న తొక్కిసలాటలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది 20 ఏళ్లు లోపు వారే కావడం మనసును కలచివేస్తోంది.

సహజంగా క్రికెట్ ను అభిమానించేది యువతే. వీరిలోనూ విరాట్ కోహ్లికి ఫ్యాన్స్ ఎక్కువ. ఇక బెంగళూరు అంటే భారత టెక్ రాజధాని. ఇక్కడి లక్షలమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లందరూ దాదాపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టునే అభిమానిస్తారనడంలో సందేహం లేదు. ఎప్పుడో 20-25 ఏళ్ల కిందట సాఫ్ట్ వేర్ జాబ్ కోసం బెంగళూరు వెళ్లి సెటిలైన వారి పిల్లలు ఇప్పుడు మంచి యుక్త వయసులో ఉండి ఉంటారు. ఇలాంటివారంతా తమ నగరానికి చెందిన జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తారు. కానీ, విధి మరోలా తలచింది.

35 వేల సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియం వద్ద 3 లక్షల ప్రజలు పెద్దఎత్తున గుమిగూడిన ఫొటోలను గమనిస్తే.. ఎక్కువ శాతం యువతే కనిపిస్తున్నారు. అలానే ప్రమాదం బారినపడినవారిలోనూ యువతే ఉన్నారు.

ఆర్సీబీ విజయోత్సవం విషాదంగా మారిన నేపథ్యంలో.. చిన్నస్వామి స్టేడియం హాహాకారాలతో దద్దరిల్లింది. ''ఈ సాలా కప్ నమదు'' అని నినదించాల్సిన సమయంలో రోదనలతో నిండిపోయింది. తొక్కిసలాట 11 మంది మృతుల్లో 9 మంది 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. గాయాలతో, అస్వస్థతతో ఆస్పత్రుల్లో చేరినవారు 35 పైనే. స్వల్పగాయాలతో ఇళ్లకు వెళ్లినవారు, ఇతర ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య 400 పైనే అని అంచనా.

కాగా, చనిపోయిన 11 మందిలో పురుషులు ఆరుగురు, మహిళలు ఐదుగురు ఉన్నారు. 13 ఏళ్ల దివ్యాంశి అనే బాలిక అత్యంత చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయింది. శరత్, శ్రవణ్ అనే 17 ఏళ్ల బాలురతో పాటు చిన్నయి, సహన అనే 19 ఏళ్ల అమ్మాయిలు, భూమిక (20) విగత జీవులయ్యారు. దివ్య (26), పూర్ణచంద్ర (35) చనిపోయినవారిలో మిగతావారు. వీరు కాక ఓ 16, 19, 20 ఏళ్ల వయసు యువకులు కూడా తొక్కిసలాటలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, స్టేడియం వద్ద తీవ్ర అస్వస్థతకు గురైన ఓ యువకుడిని పోలీసులు తమ చేతులపై తీసుకుని వెళ్తున్న ఫొటో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.