Begin typing your search above and press return to search.

ఇంటికి 10 లక్షలు..క్షతగాత్రులకు సాయం..చిన్నస్వామి ప్రమాదంపై ఆర్సీబీ

అయితే, నగర ట్రాఫిక్ అసలే దుర్భరం కావడంతో అనుమతి ఇవ్వలేదు. చివరకు అంతకుమించిన దుర్ఘటన చోటుచేసుకుని 11 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 4:26 PM IST
ఇంటికి 10 లక్షలు..క్షతగాత్రులకు సాయం..చిన్నస్వామి ప్రమాదంపై ఆర్సీబీ
X

17 ఏళ్ల తర్వాత.. 18వ సీజన్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజేతగా నిలిచి సొంత నగరానికి వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఆ ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. ముందుస్తుగా సన్నద్ధత లేకుండా.. హడావుడిగా ఏర్పాటు చేసిన విజయోత్సవం చివరకు విషాదంగా మారింది. ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం ఆర్సీబీ జట్టుకు తీవ్ర నిరాశ మిగిల్చింది. పొరపాటు ఎవరిదైనా పోయిన ప్రాణాలు తిరిగిరావు. వాస్తవానికి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో టైటిల్ సాధించిన ఆర్సీబీ జట్టును.. బుధవారం సాయంత్రమే సన్మానించాలి అనుకోవడం, బెంగళూరు నగరంలో విజయయాత్ర చేయాలనుకోవడం సరికాదు. అభిమానులు ఇంకా గెలుపు ఉద్వేగం నుంచి బయటకు రాకముందే.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఏం జరుగుతుందో బుధవారం నాటి ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం.

నిరుడు టి20 ప్రపంచ కప్ గెలిచిన టీమ్ ఇండియాను బెంగళూరు కంటే పెద్దదైన ముంబై మహా నగరంలోని వాంఖడే స్టేడియంలో గొప్పగా సన్మానించారు. అంతకుముందు విజయయాత్ర నిర్వహించారు. అరేబియా సముద్రంతో పోటీ పడుతూ అభిమానులు పోటెత్తారు. అయితే, టీమ్ ఇండియా కప్ గెలిచిన రెండు రోజుల తర్వాత ఈ వేడుక జరిగింది. బెంగళూరులో మాత్రం 24 గంటలు కూడా కాకముందే విజయోత్సవం ఏర్పాటు చేశారు. అదే కొంప ముంచింది.

దీనికిముందు విజయయాత్ర (విక్టరీ పరేడ్)కు ఆర్సీబీ ఫ్రాంచైజీ అనుమతి కోరిందట. అయితే, నగర ట్రాఫిక్ అసలే దుర్భరం కావడంతో అనుమతి ఇవ్వలేదు. చివరకు అంతకుమించిన దుర్ఘటన చోటుచేసుకుని 11 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

చిన్నస్వామి స్టేడియం దుర్ఘటనలో చనిపోయినవారికి కర్ణాటక ప్రభుత్వం మంగళవారమే పరిహారం ప్రకటించింది. రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపింది. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం సైతం రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఆర్సీబీ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నదాని ప్రకారం.. చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షలతో పాటు.. క్షతగాత్రులను ఆదుకునేందుకు ఆర్సీబీ కేర్స్ పేరిట నిధులను సమీకరించనుంది.