అబ్బో ట్రాఫిక్.. నో విక్టరీ పరేడ్.. ఆర్సీబీకి బెంగళూరు పోలీసుల షాక్
బెంగళూరు అంటే భారత దేశ టెక్ క్యాపిటల్. బెంగళూరు అంటేనే మహా ట్రాఫిక్.. కొన్నేళ్లుగా ఆ నగరంలో ట్రాఫిక్ కష్టాలపై సోషల్ మీడియాలో సెటైర్లే సెటైర్లు.
By: Tupaki Desk | 4 Jun 2025 2:28 PM ISTఒకటీ రెండు కాదు.. 18 ఏళ్ల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ సాయంత్రం సొంత నగరంలో విక్టరీ పరేడ్ అత్యంత ఘనంగా నిర్వహించాలనుకుంది. గత ఏడాది ఇదే రోజుల్లో టీమ్ ఇండియా టి20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్ ను తలపించేలా బెంగళూరు నగరంలో ఆర్సీబీ టీమ్ యాత్ర సాగించాలనుకుంది. కానీ, పోలీసులు మాత్రం అబ్బే.. కుదరదు అని చెప్పారు.
బెంగళూరు అంటే భారత దేశ టెక్ క్యాపిటల్. బెంగళూరు అంటేనే మహా ట్రాఫిక్.. కొన్నేళ్లుగా ఆ నగరంలో ట్రాఫిక్ కష్టాలపై సోషల్ మీడియాలో సెటైర్లే సెటైర్లు. రీల్సే రీల్స్.. అలాంటి నగరంలో ఆర్సీబీ జట్టు గనుక విక్టరీ పరేడ్ నిర్వహిస్తే ఇంకేమైనా ఉందా..?
పైగా ఆర్సీబీ బుధవారం సాయంత్రం పరేడ్ నిర్వహించాలని భావించింది. అంటే.. లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు విధులు ముగించుకుని వచ్చే సమయంలో విక్టరీ డే పరేడ్ అంటే... ఇక ట్రాఫిక్ కష్టాలు చెప్పేదేముంది? అందుకే ట్రాఫిక్ పోలీసులు తాము అనుమతి ఇవ్వలేం అని చేతులెత్తేశారు. ఇదే విషయాన్ని ఆర్సీబీ మేనేజ్ మెంట్ కు కూడా తెలియజేసినట్లు సమాచారం.
కిలోమీటర్ పరిధిలో జరిగే విక్టరీ డే పరేడ్ కు ప్రజలను నియంత్రించడం కష్టం అని స్పష్టం చేశారు. కర్ణాటక క్రికెట్ బోర్డు మాత్రం పోలీసుల అనుమతి ఎలాగైనా పొందాలని ప్రయత్నిస్తోంది.
మరోవైపు బెంగళూరుకు ఐకానిక్ అయిన చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సాయంత్రం ఆర్సీబీ జట్టు సభ్యులను సన్మానించనున్నారు.
