Begin typing your search above and press return to search.

తొక్కిసలాటలో రాక్షసత్వం: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన

చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో కొందరు వ్యక్తులు అత్యంత క్రూరంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 1:00 PM IST
తొక్కిసలాటలో రాక్షసత్వం: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన
X

చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో కొందరు వ్యక్తులు అత్యంత క్రూరంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. స్టేడియం కెపాసిటీ కేవలం 35 వేలు కాగా, దాదాపు 3 లక్షల మంది అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో పాటు, మహిళలపై లైంగిక వేధింపులు కూడా చోటుచేసుకున్నాయనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఓ వ్యక్తి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ద్వారా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. "నా స్నేహితుడి కజిన్ ఆ ఈవెంట్ కోసం వెళ్లింది. ఆమెను కొందరు సెక్సువల్గా వేధించారు. బట్టలు చించారు. ఎక్కడబడితే అక్కడ తాకుతూ రాక్షసంగా ప్రవర్తించారు" అని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలు సమాజంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కేవలం క్రీడా సంబరాల్లోనే కాకుండా, ఇలాంటి జనసమూహాల్లో మహిళల పట్ల జరుగుతున్న అసభ్య ప్రవర్తనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

పెరిగిన జనసమూహం, తగ్గిన భద్రత

చిన్నస్వామి స్టేడియం వంటి పెద్ద వేదికల్లో కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, నిర్వాహకులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, జనసమూహాన్ని నియంత్రించడంలో విఫలం కావడం ఇలాంటి దురదృష్టకర సంఘటనలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టేడియం సామర్థ్యానికి మించి జనాలు తరలిరావడం, వారిని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం, భద్రతా లోపాలు ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణాలని తెలుస్తోంది.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. క్రీడా సంబరాలు ప్రజలకు ఆనందాన్ని పంచాలి తప్ప, ఇలాంటి భయంకరమైన అనుభవాలను మిగల్చకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.