ఆర్సీబీ విజయోత్సవ విషాదం.. కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ సీఎం?
గత వారం ఈ సమయానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గెలవాలని కోరుకున్నారు అభిమానులు.. ఇప్పుడు చూస్తే అన్నీ వివాదాలే.
By: Tupaki Desk | 10 Jun 2025 5:41 PM ISTగత వారం ఈ సమయానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గెలవాలని కోరుకున్నారు అభిమానులు.. ఇప్పుడు చూస్తే అన్నీ వివాదాలే.. ఆర్సీబీ కప్ కొట్టి 24 గంటలు కూడా గడవకముందే సొంత నగరం బెంగళూరులో విజయోత్సవాలు జరుపుకోవాలని అనుకోవడం.. ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 నిండు ప్రాణాలు పోవడం.. పెద్ద విషాదంగా మిగిలిపోయింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు అంటేనే ట్రాఫిక్ నరకం.. కొన్ని ప్రాంతాలకు క్యాబ్ బుక్ చేస్తే క్యాన్సిలేషన్ ఖాయం అనేది సోషల్ మీడియాలో నడిచే సెటైర్. అలాంటి నగరంలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ అంటే పోలీసులు హడలిపోయారు. పర్మిషన్ కుదరదని చెప్పినట్లు మొదట కథనాలు వచ్చాయి. ఆ తర్వాత జట్టు రావడం.. ఎయిర్ పోర్ట్ లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రిసీవ్ చేసుకోవడం, సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వద్ద సన్మాన కార్యక్రమం.. స్టేడియం బయట తొక్కిసలాట.. ఇలా ఒకదాని వెంట ఒకటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
అయితే, ఇప్పుడు తొక్కిసలాట గవర్నర్-సీఎం మధ్య వివాదంగా మారుతోంది. కర్ణాటక విధాన సౌధలో ఆర్సీబీ జట్టు సన్మాన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం కీలక మలుపు తీసుకుంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ను స్వయంగా ముఖ్యమంత్రే ఆహ్వానించారని గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ ప్రకటించింది.
ఇంతకూ ఏం జరిగిందంటే.. తొలుత ఆర్సీబీ జట్టుకు రాజ్ భవన్ లో ఆతిథ్యం ఇవ్వాలని భావించారు. గవర్నర్ కార్యాలయం.. చీఫ్ సెక్రటరీని సంప్రదించి కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని కోరింది. అయితే, దీనికి బదులు తామే విధాన సౌధలో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం సిద్ధు.. గవర్నర్ ను కోరారు అని రాజ్ భవన్ తాజాగా ప్రకటించింది.
కాగా, ఈ ప్రకటనపై కర్ణాటక ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. 11 మంది చనిపోయిన తొక్కిసలాట జరిగింది చిన్నస్వామి మైదానం వద్ద అని పేర్కొంటోంది. విధాన సౌధ వద్ద కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని గుర్తుచేస్తోంది.
కాగా, సీఎం తాను ఆహ్వానితుడిని మాత్రమే అని చెబుతున్నారు. ఆర్సీబీ యాజమాన్యం అనవసర హడావుడికి పోయింది. పోలీసులు ప్రజలను నియంత్రించలేకపోయారు. ఏది ఏమైనా... ఎవరి బాధ్యత అయినా 11 నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఇప్పుడు కర్నాటకలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం మొదలైంది. అసలే ధావర్ చంద్ గెహ్లోత్ బీజేపీ నేపథ్యం నుంచి వచ్చారు. ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.
