సంచలనం... బెంగళూరు తొక్కిసలాటకు ముందు పోలీసుల లేఖలో ఏముంది?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కొసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jun 2025 4:06 PM ISTరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కొసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా సుమారు 50 మంది గాయపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సమయంలో ఓ సీనియర్ పోలీస్ అధికారి ముందే హెచ్చరిస్తూ లేఖలు రాశారనే విషయం వైరల్ గా మారింది.
అవును... ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చినస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఓ సినియర్ అధికారి ఈ పరిస్థితులను ముందే ఊహించి హెచ్చరిస్తూ పలువురు ప్రభుత్వాధికారులకు లేఖలు రాశారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో ఇప్పటికే పలువురు పోలీసులు చిక్కుల్లో ఉన్న వేళ.. ఈ విషయం కీలకంగా మారింది.
ఇందులో భాగంగా... ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమానికి ముందే పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫామ్స్ కార్యదర్శి సత్యవతితో సహా పలువురు ఉన్నతాధికారులకు, కర్ణాటక అసెంబ్లీ భద్రతను చూస్తే డీసీపీ ఎంఎన్ కరిబసవన గౌడ ఓ లేఖను రాసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ లేఖలో లక్షలాది మంది అభిమానులు వచ్చే విషయాన్ని ముందే అంచనా వేసి, వారిని నియంత్రించడం కష్టమని, సిబ్బంది కొరత ఉందని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తొంది.
"ఆ క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విధానసౌధలో కార్యక్రమం నిర్వహిస్తే.. లక్షలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. సిబ్బంది కొరత కారణంగా లక్షలాది మంది అభిమానులను నియంత్రించడం కష్టం" అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం! ఇదే సమయంలో... స్టేడియలోకి వచ్చేందుకు జారీ చేసిన ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఎంట్రీ పాస్ లను నిలిపివేయాలని కోరినట్లు చెబుతున్నారు!
ఇదే సమయంలో... ఈ భారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తగినంత సన్నాహక సమయం అవసరం అయినప్పటికీ.. బయట నుంచి అదనపు పోలీసు సిబ్బంది అవసరమని కరిబసవన గౌడ నొక్కి చెప్పినట్లు తెలుస్తొంది. ఇదే సమయంలో.. ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి లా & ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలతో సమన్వయం చాలా అవసరమని.. అందుకు ప్రస్తుతం ఉన్న సమయ వ్యవధి సరిపోదని ఆయన తెలిపినట్లు చెబుతున్నారు.
అదేవిధంగా... ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనున్న నేపథ్యంలో.. సచివాలయ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వేదిక వద్దకు తీసుకువచ్చే అవకాశం ఎక్కువగా ఉందని.. అందువల్ల వారి కుటుంబాలను తీసుకురావడాన్ని నిషేధించడంతో పాటు ఆ తేదీన సచివాలయ స్టాఫ్ కు మధ్యాహ్నం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
కాగా... బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆరోపిస్తూ.. సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్, ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ సహా పలువురు కీలక పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొన్న సంగతి తెలిసిందే! ఇదే సమయంలో.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి గోవిందరాజన్ పైనా సస్పెన్షన్ వేటు వేశారు.
