Begin typing your search above and press return to search.

ఈవీ కార్లు కాదు లో-మెయింటెనెన్స్ కోసం బ‌యోగ్యాస్ కార్లు!

తాను ఎలక్ట్రిక్ వాహనాలకు వ్యతిరేకిని కాదని.. అయితే స్వదేశీ వనరులను విస్మరించడం సమంజసం కాదని భార్గవ స్పష్టం చేశారు.

By:  Sivaji Kontham   |   1 May 2026 8:15 AM IST
ఈవీ కార్లు కాదు లో-మెయింటెనెన్స్ కోసం బ‌యోగ్యాస్ కార్లు!
X

భారతదేశం కాలుష్య ర‌హితంగా మారాల‌నే ల‌క్ష్యం చేరుకోవ‌డానికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పైనే ఆధారపడటం సరైన మార్గం కాదని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ స్పష్టం చేశారు. ఢిల్లీ ఈవీ పాలసీ అయినా లేదా కేఫ్ (సిఎఎఫ్.ఇ) నిబంధనలైనా.. అంతిమ ఉద్దేశం కాలుష్య రహిత భారతం అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇందుకోసం భారతదేశంలో అత్యంత చౌకగా లభించే `బయో గ్యాస్`ను రవాణా ఇంధనంగా వినియోగించాలని ఆయన గట్టిగా వాదించారు. చిన్న కార్ల విభాగంలో బయో గ్యాస్ ఒక అద్భుతమైన ... పర్యావరణ హితమైన ఇంధన ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో పాటు ప్రపంచంలోనే అత్యధిక పశుసంపద కలిగిన దేశమని ఆర్‌సీ భార్గవ గుర్తుచేశారు. జంతు వ్యర్థాల ద్వారా బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే అపారమైన సామర్థ్యం మనకు ఉందని... దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా వ్యవసాయ అవసరాలకు కూడా మేలు జరుగుతుందని ఆయన వివరించారు. భారతదేశ తలసరి ఆదాయం తక్కువగా ఉన్న నేపథ్యంలో... సామాన్యులకు పెద్ద వాహనాలు భారమవుతాయని, అందుకే రాబోయే రెండు దశాబ్దాల పాటు భారత మార్కెట్‌లో చిన్న కార్ల హవా కొనసాగుతుందని, వాటికి బయో గ్యాస్ సరైన ఇంధనమని ఆయన పేర్కొన్నారు.

తాను ఎలక్ట్రిక్ వాహనాలకు వ్యతిరేకిని కాదని.. అయితే స్వదేశీ వనరులను విస్మరించడం సమంజసం కాదని భార్గవ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈవీ బ్యాటరీల కోసం మనం చైనా వంటి దేశాల నుంచి దిగుమతులపై పూర్తిగా ఆధారపడుతున్నామని... ఇది దేశ ఇంధన భద్రతకు ముప్పు కలిగించవచ్చని ఆయన హెచ్చరించారు. కేవలం ఈవీలకే పరిమితం కాకుండా.. ప‌లు రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించాలని కోరారు. దిగుమతులతో సంబంధం లేకుండా మన సొంత సహజ సంపదైన బయో గ్యాస్‌ను వాడుకోవడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా దేశం స్వావలంబన సాధిస్తుందని ఆయన వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈవీల దత్తత వేగం మునుపటి అంచనాల కంటే నెమ్మదించిందని.. దీనివల్ల అనేక కంపెనీలు భారీ పెట్టుబడులను నష్టపోయాయని విశ్లేషించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఎప్పటికీ కొనసాగవని.. ఇప్పటికే చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో సబ్సిడీలను తగ్గిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కస్టమర్లు పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపడం లేదని.. అక్కడ హైబ్రిడ్ కార్లు.. ఎలక్ట్రిక్ కార్లు సమాన స్థాయిలో అమ్ముడవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన విధానాలను రూపొందించుకోవాలని భార్గవ సూచించారు. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దిగుమతులకు ఆటంకం కలిగితే.. కేవలం ఈవీలపైనే ఆధారపడే కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. అందుకే ఒకే మార్గాన్ని అనుసరించకుండా బయో గ్యాస్, హైబ్రిడ్ ... ఈవీల కలయికతో కూడిన బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లడం వల్లనే పర్యావరణ లక్ష్యాలను సులభంగా, సురక్షితంగా చేరుకోవచ్చని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే ఈవీల‌ను ప్రోత్స‌హించిన ప్ర‌భుత్వాలు బ‌యోగ్యాస్‌ని ప్రోత్స‌హిస్తాయా? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌.