Begin typing your search above and press return to search.

అమరావతికి మరో షాక్‌.. విశాఖలో ఆ సంస్థ కార్యాలయం!

అమరావతిలో ఏర్పాటు కావాల్సిన మరో కార్యాలయం విశాఖపట్నానికి తరలిపోతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో ఉంది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 7:58 AM GMT
అమరావతికి మరో షాక్‌.. విశాఖలో ఆ సంస్థ కార్యాలయం!
X

అమరావతిలో ఏర్పాటు కావాల్సిన మరో కార్యాలయం విశాఖపట్నానికి తరలిపోతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. దీనికి ప్రాంతీయ కార్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో హైదరాబాద్‌ లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఉండేది.

అయితే రాష్ట్రం విడిపోయాక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడంతో ఆర్బీఐ అక్కడ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు మొగ్గుచూపింది. ఈ క్రమంలో నాటి టీడీపీ ప్రభుత్వం అమరావతిలో 11 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంతోపాటు ఉద్యోగుల నివాసాలకు మంజూరు చేసింది.

కాగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదాన్ని అందుకుంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానుల జీవోలను ఏపీ హైకోర్టు కొట్టేసినా జగన్‌ ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మరోవైపు వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు విశాఖపట్నమే రాజధాని అంటూ తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పరిపాలన కూడా అక్కడి నుంచే ఉంటుందంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని అక్కడి జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఇటీవల లేఖ రాశారని చెబుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, రెండు లిప్టులు, విద్యుత్తు కనెక్షన్, అంతర్గత పార్కింగ్, ఇంటర్నెట్, కౌంటర్లు తదితర వసతులతో అయిదేళ్ల కాలానికి అద్దె ప్రాతిపదికన భవనాలను ఎంపిక చేయాలని లేఖలో సూచించారని అంటున్నారు.

విశాఖలో అనువైన భవనాలను గుర్తించి తెలియజేస్తే.. తమ బృందం పరిశీలిస్తుందని ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌ రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ అధికారులు ఉటంకించారు.

కాగా 2022 ఆగస్టు 22 నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా ఏపీ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తోంది. అయితే అంతకు ముందే.. అంటే 2016లోనే టీడీపీ ప్రభుత్వం అమరావతిలో భారతీయ రిజర్వు బ్యాంకు కార్యాలయం, నివాస సముదాయాల ఏర్పాటుకు 11 ఎకరాల భూముల్ని కేటాయించింది.

మిగతా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించినట్టే అమరావతిలో ఆర్బీఐకి కూడా చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో భూమలును కేటాయించింది. అప్పట్లో నిర్ణీత ధరపై 99 ఏళ్ల లీజుకు 11 ఎకరాలను కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపైనే దృష్టి సారించడంతో అమరావతిలో తమ పనులను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు రావడం లేదని అంటున్నారు.

మరోవైపు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా.. ఇప్పటికీ నాబార్డు, ఆర్బీఐ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగానే పనిచేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.