Begin typing your search above and press return to search.

పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ కు అదే లాస్ట్ డేట్

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిలిపివేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంగతి తెలిసింది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 9:25 AM GMT
పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ కు అదే లాస్ట్ డేట్
X

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిలిపివేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంగతి తెలిసింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ సేవలను నిలిపివేయాలంటూ ఆర్బిఐ ఆదేశాలు ఇవ్వడంతో పేటీఎం ఖాతాదారులంతా ఆందోళనకు గురవుతున్నారు. తమ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడం, వినియోగించుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పేటీఎంకు టోల్ అథార్టీ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ లను కొనేందుకు ఎంపిక చేసిన బ్యాంకులో జాబితా నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును మినహాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ పొందుపరిచిన 32 అధీకృత బ్యాంకుల జాబితా నుంచి ఫాస్ట్ ట్యాగ్ లను కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ క్రమంలోనే దాదాపు 20 మిలియన్ల పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు కొత్త ఆర్ ఎఫ్ ఐడి స్టిక్కర్లను కొనాల్సి ఉంటుందని భారత రహదారి టోల్ అథారిటీ శాఖ సూచించింది. ఆర్బిఐ దెబ్బకు 11 రోజుల వ్యవధిలో పేటీఎం 27 వేల కోట్ల రూపాయలను నష్టపోయిన సంగతి తెలిసిందే.

మరోవైపు, చిన్నచిన్న బడ్డీ కొట్లు మొదలు...పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ వరకు పేటీఎం క్యూఆర్ కోడ్ బాక్సులు, సౌండ్ బాక్సులు వాడుతున్నాయి. అయితే, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న వినియోగదారులను కలవరపెడుతోంది. ఇందుకు సంబంధించిన గడువును మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బిఐ వెసులుబాటు కల్పించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఖాతాలో నగదును 2024 మార్చి 15 వరకు జమ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, మార్చి 15 తర్వాత ఆ ఖాతాలో నగదు డిపాజిట్ చేయడానికి వీలు ఉండదు. కానీ, మార్చి 15 తర్వాత అంతకుముందే డిపాజిట్ చేసిన డబ్బులను రకరకాల మార్గాల ద్వారా విత్ డ్రా లేదా వినియోగం చేసుకోవచ్చు. దీంతోపాటు నగదు బదిలీ పథకాలు, సబ్సిడీలు, ఆటో డెబిట్లు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ వాలెట్లకు సంబంధించిన గడువు కూడా మార్చి 15 గా ఆర్బిఐ నిర్ణయించింది.

ఒక ముక్కలో చెప్పాలంటే మార్చి 15 లోపు పేటీఎంలోని డబ్బులను వాడేసుకోవడం మంచిది. మార్చి 15 తర్వాత కొత్తగా దాంట్లో డబ్బు జమ చేయలేం. కానీ ఆల్రెడీ జమ ఉన్న డబ్బులను మార్చి 15 తర్వాత కూడా వినియోగించుకునే వెసులుబాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. ఇదే నిబంధన పేటీఎం క్యూఆర్ కోడ్లు, పేటియం సౌండ్ బాక్స్, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్, పాయింట్ ఆఫ్ సేల్ మర్చంట్స్ , పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) మిషన్లకు కూడా వర్తిస్తుంది.