ఆర్ బీఐ ఊరట వేళ.. మీ ఈఎంఐ ఎంత తగ్గుతుంది?
ఇంతకూ తాజాగా తగ్గించిన రెపోరేటుతో ఎంత మేలు జరుగుతుంది? అన్న విషయానికి వస్తే.. ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
By: Tupaki Desk | 7 Jun 2025 5:00 PM ISTసామాన్యుడు మాత్రమే కాదు సంపన్నుడికి సైతం వాయిదాలతో ఇళ్లను కొనటం మామూలే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా.. సంపద పెరిగే కొద్దీ తీసుకునే రుణం పెరుగుతుంది. దానికి తగ్గట్లే ఈఎంఐ కూడా ఉంటుంది. ఇంటి లోన్ తీసుకోకుండా ఇంటిని కొనేటోళ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో నూటికి ఐదుగురు కూడా ఉండరేమో. మరి.. ఇంటి లోన్ ను వాయిదాల పద్దతిలో చెల్లించే ప్రతి ఒక్కరికి ఊరట కలిగించేలా భారత రిజర్వు బ్యాంక్ రెపోరేట్లను తగ్గించింది. తాజాగా 50 బేసిక్ పాయింట్లు తగ్గించటం ద్వారా రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగించిందని చెప్పాలి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇలా తగ్గించటం ఇది మూడోసారి.
ఇంటి లోన్ తీసుకునే వేళలో ప్లాట్ పద్దతిలోనూ.. ఫ్లోటింగ్ రేట్ మీదా రుణాలు తీసుకుంటారు. ఫ్లోటింగ్ రేట్ మీద రుణం తీసుకున్న వారికి తాజాగా సవరించిన వడ్డీ రేటుకు సంబంధించిన ఊరట లభిస్తుంది. 2019 అక్టోబరు ఒకటి తర్వాత జారీ చేసే ఇంటి రుణాలన్నీ దాదాపు ఫ్లోటింగ్ రేటుతో ఉండేవే కావటంతో.. రిజర్వు బ్యాంకు నిర్ణయానికి తగ్గట్లు వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్నది తెలిసిందే, కాకుంటే దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని బ్యాంకులు ప్రాసెస్ పేరుతో వసూలు చేస్తాయి.. అది వేరే సంగతి.
కొత్తగా రుణాలు తీసుకునే వారు తక్కువ వడ్డీకి రుణాలు పొందే వీలుంది. తక్కువ వడ్డీ రేటు నేపథ్యంలో ఎక్కువ మొత్తం రుణాన్ని పొందే వీలుంది. ఆర్ బీఐ రెపో రేట్ ను తగ్గించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకటి తగ్గిన వడ్డీ రేటుకు తగ్గట్లు ఈఎంఐ తగ్గించుకోవటం.. రెండోది కాల వ్యవధిని తగ్గించుకోవటం. నిపుణుల సూచనల ప్రకారం చూస్తే.. రెండో ఆప్షన్ ను ఎంపిక చేసుకోవటం మంచిదని చెబుతారు. ఎందుకంటే.. ఈఎంఐలు తీర్చాల్సిన గడువు తగ్గితే.. ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకునే వీలుంటుంది.
ఇంతకూ తాజాగా తగ్గించిన రెపోరేటుతో ఎంత మేలు జరుగుతుంది? అన్న విషయానికి వస్తే.. ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో 20 ఏళ్లు అంటే.. 240 నెలల కాల వ్యవధికి రూ.25లక్షల రుణాన్ని తీసుకున్నారని అనుకుందాం. అప్పట్లో బ్యాంకు వడ్డీ రేటు 8.50 శాతం ఉంది. అంటే నెలకు రూ.21,696 అవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు దఫాల్లో వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఈఎంఐ రూ.20,140కు తగ్గుతుంది. అంటే.. నెలకు రూ.1556 మేరకు తగ్గుతుంది.దీర్ఘకాలంలో దాదాపు రూ.3.6 లక్షల మేర తగ్గే వీలుంది.
ఇలాంటి వేళ ఇప్పుడు కట్టే ఈఎంఐను యథాతధంగా ఉంచేసి.. కాలవ్యవధి మార్చుకుంటే చెల్లింపుల గడువు మూడేళ్లు తగ్గుతుంది. అంటే మొత్తం 240 నెలల కాల వ్యవధికి తీసుకున్న రుణానికి ఆర్ బీఐ తగ్గించిన వడ్డీ రేట్ల పుణ్యమా అని ఈ లోన్ 206 నెలల్లో కట్టేయొచ్చు. అంటే.. వడ్డీ భారం దాదాపు రూ.7.40 లక్షల వరకు తగ్గే వీలుంది.అయితే.. ఇక్కడో పాయింట్ ను తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు ఎంత త్వరగా తమ వినియోగదారులకు అమలు చేస్తారన్నది కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు కొంత ఆలస్యంగా స్పందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మాత్రం వెంటనే రియాక్టు అవుతుంటాయి. మీ బ్యాంకుల్ని సంప్రదించటం ద్వారా మరిన్ని వివరాల్ని తెలుసుకునే వీలు ఉంటుంది.
