బంగారంపై రుణాలు.. కొత్త మార్గదర్శకాలు వచ్చేశాయి
బంగారాన్ని ఆభరణాలుగా కాకుండా భవిష్యత్తు అవసరాలు తీర్చే మూలధనంగా చాలామంది భావిస్తారు. చేతిలో డబ్బులు ఉన్నంతనే కాస్తంత బంగారాన్ని కొనటం..
By: Tupaki Desk | 7 Jun 2025 8:00 PM ISTబంగారాన్ని ఆభరణాలుగా కాకుండా భవిష్యత్తు అవసరాలు తీర్చే మూలధనంగా చాలామంది భావిస్తారు. చేతిలో డబ్బులు ఉన్నంతనే కాస్తంత బంగారాన్ని కొనటం.. డబ్బుల అవసరం వచ్చినప్పుడు వాటిని తాకట్టు పెట్టుకొని రుణాలు తీసుకోవటం చాలామంది విషయంలో జరిగేదే. ఇలా రుణాలు తీసుకునే అంశానికి సంబంధించి భారత రిజర్వు బ్యాంక్ సరికొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అవేమంటే..
- ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్.. గోల్డ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా రుణాల్ని మంజూరు చేయటానికి వీల్లేదు.
- బంగారం నాణ్యతతో పాటు.. తాకట్టు తేదీకి తొలి 30 రోజుల్లో సగటు ముగింపు ధరను పరిగణలోకి తీసుకోవాలి.
- అలా కాదంటే ముందు రోజు ముగింపు ధర ప్రకారం కూడా రుణ గ్రహీతకు ఎంత మొత్తం అప్పు ఇవ్వాలన్నది లెక్కించొచ్చు.
- రూ.2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ 85 శాతంగా భారత రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది.
- రూ.2.5 లక్షల నుంచి రూ.5లక్షలవరకు అయితే 80 శాతం.. రూ.5 లక్షలు దాటిన రుణాలకు 75 శాతం నిర్ణయించింది.
- తాకట్టు పెట్టే బంగారం వస్తువుల రూపంలో ఉంటే ఒక కేజీ.. వెండి అయితే 10 కేజీలకు మించకూడదు.
- గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్ 50 గ్రాములు.. వెండి కాయిన్స్ అయితే 500 గ్రాములు దాటకూడదు.
- ఒకవేళ తాకట్టుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తే.. తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని అదే రోజు ఇవ్వాలి.
- కొన్ని సందర్భాల్లో మాత్రం గరిష్ఠంగా 7 పని దినాలకు మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
- రుణదాతకు.. రుణగ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాల్ని ఆర్ బీఐ స్పష్టంగా పేర్కొంది.
- తాకట్టు పెట్టే వస్తువుల వివరాలు.. వాటి విలువను కచ్ఛితంగా పేర్కొనాలి.
- తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోతే.. వేలం ప్రక్రియ ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లో స్పష్టంగా ఉండాలి.
- వేలానికి ముందు అప్పు తిరిగి చెల్లించేందుకు రుణగ్రహీతకు ఇవ్వాల్సిన నోటీసు వ్యవధిని పేర్కొనాలి.
- తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోతే.. వేలం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లించే వివరాలు కూడా డాక్యుమెంట్ లో పేర్కొనాలి.
