అబ్బే బంగారం అమ్మలేదు.. వార్తలన్నీ అబద్దాలు.. ఆర్బీఐ బయటపడింది..
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సోషల్ మీడియా, పలు అంతర్జాతీయ వేదికల్లో వస్తున్న ఒక కీలక వార్తపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్రంగా స్పందించింది.
By: A.N.Kumar | 3 Jun 2026 3:47 PM ISTదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సోషల్ మీడియా, పలు అంతర్జాతీయ వేదికల్లో వస్తున్న ఒక కీలక వార్తపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్రంగా స్పందించింది. భారత దేశానికి చెందిన బంగారు నిల్వలను ఆర్బీఐ విక్రయించిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'బ్లూమ్‌బర్గ్' ప్రచురించిన కథనాన్ని కేంద్ర బ్యాంక్ పూర్తిగా ఖండించింది. తమ వద్ద ఉన్న గోల్డ్ రిజర్వులలో ఎలాంటి తగ్గుదల లేదని, దేశ బంగారు నిల్వలు పూర్తిగా సురక్షితంగా యథాతథంగా ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అసలు ప్రచారం ఏమిటి? బ్లూమ్‌బర్గ్ కథనంలో ఏముంది?
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దీనివల్ల భారత ఇంధన దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. మరోవైపు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు తమ ఈక్విటీలను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామాల వల్ల మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరిగి, భారత రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పడింది.
ఈ నేపథ్యంలో రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలను (ఫారెక్స్ రిజర్వ్స్) బలోపేతం చేయడానికి ఆర్బీఐ సుమారు 6 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ బ్లూమ్‌బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త దేశీయంగా ఆర్థిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఆర్బీఐ వద్ద ప్రస్తుతం ఉన్న గోల్డ్ నిల్వలు ఎంత?
ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ ఆర్బీఐ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశం వద్ద 880.52 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. "గోల్డ్ రిజర్వుల అమ్మకంపై వస్తున్న వార్తలు ముమ్మాటికీ వాస్తవ విరుద్ధం. దేశ బంగారు నిల్వల్లో ఎలాంటి విక్రయాలు జరగలేదు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోని 'మంత్లీ బులెటిన్' లో పారదర్శకంగా అందుబాటులో ఉంది. ప్రజలు, పెట్టుబడిదారులు ఇటువంటి వదంతులను నమ్మవద్దు." అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనా?
దేశ ఫారెక్స్ నిల్వలు గత కొన్ని నెలలుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో $728.49 బిలియన్ డాలర్లు ఉండగా.. ప్రస్తుతం $681.40కి పడిపోయింది. దిగుమతి బిల్లులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గుల వల్ల ఫారెక్స్ నిల్వలు తగ్గినప్పటికీ ఆ లోటును పూడ్చడానికి బంగారాన్ని అమ్మాల్సిన అవసరం ఆర్బీఐకి రాలేదని స్పష్టమవుతోంది.
అధికారిక సమాచారాన్నే నమ్మండి
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉందని, తాత్కాలిక అంతర్జాతీయ పరిణామాల వల్ల రూపాయిపై ఒత్తిడి ఉన్నప్పటికీ దేశ వ్యూహాత్మక నిల్వలు సురక్షితంగా ఉన్నాయని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. దేశ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన సున్నితమైన విషయాలలో కేవలం కేంద్ర బ్యాంక్ విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆర్బీఐ ప్రజలకు, మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది.
