నిన్న నిర్మలా సీతారామన్.. నేడు ఆర్ బీఐ.. కస్టమర్లకు భారీ రిలీఫ్
పలు సందర్భాల్లో బ్యాంకులు వ్యవహరించే తీరుకు కోపంతో కూడిన వేదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
By: Garuda Media | 27 Feb 2026 11:22 AM ISTపలు సందర్భాల్లో బ్యాంకులు వ్యవహరించే తీరుకు కోపంతో కూడిన వేదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏం చేయాలో పాలుపోక.. నిబంధనల్ని ఎలా ప్రశ్నించాలో అర్థం కాని పరిస్థితి. దీంతో.. తాము మోసపోతున్నట్లు అర్థమవుతున్నా.. పోరాడే దన్ను లేని దుస్థితి లక్షలాది మందికి ఎదురై ఉంటుంది. బ్యాంకింగ్ ను పూర్తి వ్యాపారంగా మార్చేసిన ప్రస్తుత రోజుల్లో.. వాటికి ముకుతాడు వేసేలా పరిణామాలుచోటు చేసుకున్నాయి. మొన్నటికి మొన్న బ్యాంకర్లతో జరిగిన భేటీ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంక్ కస్టమర్ల విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలన్న ఆమె.. వారికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.
నిర్మలమ్మ చేసిన హెచ్చరికలతో బ్యాంక్ కస్టమర్లకు ఒనగూరే ప్రయోజనాల్ని చూస్తే..
- ఇంటి రుణాలు.. ఇతర లోన్లు తీసుకునే వేళ బ్యాంకులు తమ కస్టమర్ల మీద బలవంతంగా బీమా పాలసీలను రుద్దతుంటారు. అలాంటివి చేయకూడదని తేల్చారు.
- బీమా లాంటి ఆర్థిక ఉత్పత్తులను తప్పుదారి పట్టించి అమ్మటం నేరంగా పరిగణించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి భారత రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చే నూతన మార్గదర్శకాలను ప్రస్తావించి.. వెల్ కం చెప్పారు.
- కొత్త రూల్స్ ప్రకారం తప్పుగా అమ్మినా ఉత్పత్తుల సొమ్మును బ్యాంకులు ఆయా వినియోగదారులకు పూర్తిగా వెనక్కి ఇవ్వటమే కాదు.. జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
- బ్యాంకులు బీమా ఉత్పత్తుల అమ్మకాల మీద కాకుండా డిపాజిట్ల సేకరణ.. రుణాల మంజూరు లాంటి అంశాల మీద ఫోకస్ చేయాలని.. దీంతో ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుతాయన్నారు.
- వినియోగదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా డిజిటల్ ఫ్లాట్ ఫారాలను సరళతరం చేయాలని.. బ్యాంక్ బ్రాంచ్ లలో ఖాతాదారులతో స్నేహపూర్వక వాతావరణంలో పని చేయాలని గతంలోనూ ఆదేశించారు.
బ్యాంకులకు నేరుగా కేంద్రమంత్రి నిర్మలమ్మ చేసిన హెచ్చరికలు ఇలా ఉంటే.. తాజాగా భారత రిజర్వు బ్యాంక్ మరో కీలక ఆదేశాల్ని జారీ చేసింది. ఈ ప్రకటనలో బ్యాంక్ వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగేలా చర్యల్ని ప్రకటించారు. ప్రస్తుతం మొబైల్ యాప్ లు.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే.. కొన్నిసార్లు కొన్ని బ్యాంక్ యాప్ లు.. వెబ్ సైట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా రూపకల్పన చేసినట్లుగా కనిపిస్తాయి.
ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తాజాగా కీలక అంశాల్ని ప్రస్తావించింది. అందులో ముఖ్యమైనవి చూస్తే..
- కొన్ని బ్యాంక్ యాప్ లు.. వెబ్ సైట్లను వినియోగించేటప్పుడు చివరిదశలోకొన్ని అదనపు ఛార్జీలు కనిపిస్తుంటాయి. కొన్ని సేవల్ని అదే పనిగా కొనమనే సూచనలు వస్తుంటాయి. ఇలాంటి మోసపూరిత విధానాలను డార్క్ ప్యాటర్స్న్ అంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆర్ బీఐ నడుంబిగించింది.
- అన్ని బ్యాంకులు తమ వెబ్ సైట్లు.. మొబైల్ యాప్ లలో ఉన్న అన్ని డార్క్ ప్యాటర్న్స్ ను 2026 జులై నాటికి తొలగించాలి.
- బ్యాంకులు తమ ఆర్థిక ఉత్పత్తులను ప్రచారం చేసే విధానంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
- కస్టమర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.
- ఏదైనా కొత్త సేవను అందించే ముందు వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోవాలి. కస్టమర్లకు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత.. వారి అంగీకారం పొందిన తర్వాతే వారికి తెలియజేయాల్సి ఉంటుంది.
