Begin typing your search above and press return to search.

పేటీఎం బ్యాంక్ లైసెన్స్ రద్దు.. UPI పేమెంట్లు రీఛార్జుల సంగ‌తేంటి?

యూజర్లు ఎక్కువగా వాడే యూపీఐ (యుపిఐ) లావాదేవీలు, మొబైల్ రీఛార్జ్‌లు, ఇతర పేమెంట్ సర్వీసుల విషయంలో ఆందోళన అవసరం లేదని తెలుస్తోంది.

By:  Sivaji Kontham   |   25 April 2026 9:16 AM IST
పేటీఎం బ్యాంక్ లైసెన్స్ రద్దు.. UPI పేమెంట్లు రీఛార్జుల సంగ‌తేంటి?
X

భారత బ్యాంకింగ్ రంగంలో సంచలనం రేపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ).. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలను పాటించడంలో పదేపదే విఫలం కావడం .. బ్యాంక్ వ్యవహార శైలి డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం. 1949 నాటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని కీలక నిబంధనలను ఈ బ్యాంక్ ఉల్లంఘించిందని ఆర్బీఐ స్పష్టం చేస్తూ.. తక్షణమే బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ పరిణామం వల్ల సామాన్య ఖాతాదారులలో తమ సొమ్ము భద్రతపై సందేహాలు తలెత్తాయి. అయితే, డిపాజిటర్లందరికీ తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు నిల్వలు బ్యాంక్ వద్ద ఉన్నాయని..వినియోగదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. బ్యాంక్ మూసివేత ప్రక్రియను పర్యవేక్షించేందుకు.. అధికారికంగా మూసివేయాల్సిందిగా కోరుతూ కేంద్ర బ్యాంక్ త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనుంది.

యూజర్లు ఎక్కువగా వాడే యూపీఐ (యుపిఐ) లావాదేవీలు, మొబైల్ రీఛార్జ్‌లు, ఇతర పేమెంట్ సర్వీసుల విషయంలో ఆందోళన అవసరం లేదని తెలుస్తోంది. పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ తమ యాప్ ద్వారా అందించే ప్రధాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంటే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దయినా.. థర్డ్ పార్టీ బ్యాంకుల భాగస్వామ్యంతో పేటీఎం యాప్ సేవలు అందుబాటులో ఉంటాయి.

పేటీఎం క్యూఆర్ కోడ్స్, సౌండ్‌బాక్స్‌లు, కార్డ్ మెషీన్లు, పేమెంట్ గేట్‌వే సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తాయని సంస్థ హామీ ఇచ్చింది. అలాగే పేటీఎం మనీ, పేటీఎం గోల్డ్ వంటి పెట్టుబడి సాధనాలు కూడా సురక్షితంగా ఉంటాయని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇప్ప‌టికే (మార్చి 2024 నాటికే) ఈ బ్యాంక్‌లో పెట్టుబడులను తగ్గించుకున్నామని.. కాబట్టి ఈ తాజా పరిణామం వల్ల తమ వ్యాపారానికి ప్రత్యక్షంగా పెద్ద నష్టం లేదని వన్97 కమ్యూనికేషన్స్ వివరణ ఇచ్చింది.

వాస్తవానికి పేటీఎం బ్యాంక్ పై ఆర్బీఐ నిఘా గత కొంతకాలంగా కొనసాగుతోంది. 2022లోనే కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసినా.. నిబంధనల అమలులో లోపాలు సరిదిద్దుకోకపోవడంతో ఈ నిర్ణయం వెలువడింది. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను కాపాడేందుకే ఆర్బీఐ ఈ చర్య చేపట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఖాతాదారులు తమ వాలెట్ లేదా సేవింగ్స్ అకౌంట్లలో ఉన్న బ్యాలెన్స్‌ను ఇతర బ్యాంకులకు బదిలీ చేసుకోవడం లేదా వాడుకోవడం ఉత్తమం.