నాన్న వైసీపీ ఇన్చార్జి.. కూతురు టీడీపీ ఇన్చార్జి.. గోదావరి తీరంలో ఆసక్తికర రాజకీయం
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తండ్రీకూతుళ్ల యుద్ధానికి తెరలేచింది.
By: Tupaki Desk | 24 Sept 2025 8:00 PM ISTఅంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తండ్రీకూతుళ్ల యుద్ధానికి తెరలేచింది. ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా గొల్లపల్లి అమూల్య ఎంపిక అయ్యారు. ఈమె తండ్రి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం వైసీపీలో ఉండగా, గత ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వైసీపీ ఇన్చార్జిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈయనకు పోటీగా అధికార పార్టీ సొంత కూతురికే బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయంతో రాజోలు నియోజకవర్గంలో ఇకపై తండ్రీ కూతుళ్ల మధ్య సమరం జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి జనసేన నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తొలి నుంచి టీడీపీలో ఉన్న అమూల్య ఎమ్మెల్యేతో కలిసి చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నారు. గత 16 నెలలుగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. దీంతో ఐవీఆర్ఎస్ సర్వేలో ఆమెకు ఇన్చార్జి పదవి ఇవ్వాలని 70 శాతం మంది కోరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజోలు ఇన్చార్జిగా అమూల్య పేరు ఖరారు చేశారు.
ఈ నియామకం ద్వారా తండ్రిని ఢీకొట్టేందుకు అమూల్య రెడీ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అన్నాదమ్ములు, అన్నాచెల్లెళ్లు మధ్య రాజకీయ పోరాటం జరిగింది. మాజీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, విజయవాడ ఎంపీ కేశినేని బ్రదర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు రాజకీయ యుద్ధానికి తెరతీశాయి. కానీ, తండ్రి, పిల్లలు మధ్య పోటీ జరిగిన పరిస్థితి ఇంతవరకు పెద్దగా లేనట్లే చెబుతున్నారు. తొలిసారిగా రాజోలులో గొల్లపల్లి సూర్యారావు వర్సెస్ అమూల్య మధ్య జరగనున్న రాజకీయ యుద్ధం కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అంటున్నారు.
వాస్తవానికి వైసీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు ముందు టీడీపీలోనే ఉండేవారు. 1985లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల 2014లో మళ్లీ టీడీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావు రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో జనసేన పోటీలో నిలవడంతో ఓట్లు చీలి ఆయన ఓటమి పాలయ్యారు.
ఇక గత ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే కొనసాగిన గొల్లపల్లి చివరి నిమిషంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గొల్లపల్లి సూర్యారావు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడంతో ఆయనకు చాన్స్ దక్కలేదు. దీంతో కినుక వహించిన ఆయన వైసీపీలోకి వెళ్లి రాజోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికీ ఆ పార్టీ తరఫున చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే తండ్రి వైసీపీలోకి వెళ్లడాన్ని ఇష్టపడని అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగారు.
నిజానికి రాజోలును జనసేనకు కేటాయించకపోతే అమూల్యనే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని టీడీపీ భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఆయన కుమారుడు కూడా అమూల్యపై కినుక వహించినట్లు ప్రచారం ఉంది. కార్యకర్తలతో మమేకమవడంతోపాటు రాజకీయ వ్యూహాల్లో అరితేరినట్లు వ్యవహరించడం అమూల్యకు ప్లస్ అయ్యాయంటున్నారు. అందుకే నియోజకవర్గంలో 70 శాతం మంది ఆమె నాయకత్వానికి జైకొట్టారని అంటున్నారు.
