Begin typing your search above and press return to search.

అజహర్.. రాయుడు.. రాజకీయాల్లో ‘ఆడలేకపోయారా?’

భారత దేశంలో ప్రజలు ఆసక్తిగా గమనించే అంశాలు మూడు.. క్రికెట్, సినిమా, రాజకీయాలు. ఎప్పటికప్పుడు వీటిలో పరిణామాలను పరిశీలిస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 3:30 PM GMT
అజహర్.. రాయుడు.. రాజకీయాల్లో ‘ఆడలేకపోయారా?’
X

భారత దేశంలో ప్రజలు ఆసక్తిగా గమనించే అంశాలు మూడు.. క్రికెట్, సినిమా, రాజకీయాలు. ఎప్పటికప్పుడు వీటిలో పరిణామాలను పరిశీలిస్తూ ఉంటారు. క్రికెటర్లు, సినిమా తారల్లో కొందరి లక్ష్యం రాజకీయాలు. ఎక్కువ సంఖ్యలో ప్రజలతో కలిసే అవకాశం, సెలబ్రిటీ హోదాను మరికొంత కాలం కొనసాగించే వీలు, అన్నిటికి మించి అధికారం.. సినిమా, క్రికెటర్ స్టార్లను రాజకీయాల వైపు నడిపిస్తుంటాయనడంలో సందేహం లేదు. అయితే, తమ పునాది ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చినా.. వాటిలో నిలదొక్కుకోవడం మాటలు కాదు. అనేక ఎత్తులు, పైఎత్తుల మధ్య సాగే రాజకీయాల్లో గెలవడం అంత సులువు కాదు.

ఇద్దరు ‘కెప్టెన్లు’.. పొలిటికల్ క్రీజులో

టీమిండియాకు దాదాపు దశాబ్ద కాలం పాటు కెప్టెన్ గా వ్యవహరించాడు మొహమ్మద్ అజహరుద్దీన్. మూడు వరుస వన్డే ప్రపంచ కప్ లలో అతడు సారథి. అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అలాంటి అజహర్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి తన ఘనతను తానే చెడగొట్టుకున్నాడు. లేకుంటే ఇప్పటికి ఎక్కడో ఉండేవాడు. 2000 సంవత్సరం తర్వాత దగ్గరదగ్గరగా పదేళ్లు స్తబ్ధుగానే ఉన్న అజహర్.. 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచాడు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు. ఇటీవలి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బరిలో దిగి ఓడిపోయాడు. అయితే, అజహర్ స్థాయికి ఈ సీటు కచ్చితంగా గెలిచేది. 1.10 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉండడమే దీనికి కారణం. కానీ, ప్రధానంగా వారిమీదనే ఫోకస్ చేసి మిగతా వర్గాలకు దగ్గర కాలేకపోయాడు. ఫలితంగా పరాజయం చవిచూశాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అజహర్ రాజకీయ పయనం వ్యూహం లేకుండా, చొచ్చుకుపోయే తీరున, కలుపుకొని పోయే తరహా సాగలేదు అనేందుకు యూపీ-రాజస్థాన్-తెలంగాణ చుట్టూ తిరిగిన వైనమే నిదర్శనం.

రాయుడు రనౌట్..?

ఉమ్మడి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగినవారిలో అజహర్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత చెప్పుకోదగ్గవాడు అంబటి రాయుడు. అలాంటి రాయుడు క్రీడాకారుడిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చేటు చేశాయి. లేదంటే ఎక్కడో ఉండాల్సిన వాడు. తర్వాత రాయుడు కిందామీద పడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అయితే, అక్కడా బ్యాడ్ లక్ వెంటాడింది. మరోవైపు రాయుడు కొంతకాలంగా ఏపీ అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా స్టేట్ మెంట్లు ఇస్తూ వచ్చాడు. రెండు వారాల కిందట ఆ పార్టీలో చేరాడు. కానీ, బయటకు వచ్చేశాడు. ప్రైవేటు లీగ్ ఆడేందుకు విదేశాలకు వెళ్తున్నానని, రాజకీయాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇంతలోనే బుధవారం జనసేనకు మద్దుతు పలికాడు. మరి ఎన్నికల్లో పోటీకి అయినా సిద్ధంగా ఉంటాడో లేదో చూడాలి. చివరకు చెప్పేది ఏమంటే.. సీనియర్ జట్టు కెప్టెన్ అజహర్, అండర్ 19 కెప్టెన్ రాయుడు ఇద్దరూ రాజకీయాల్లో ఆడలేకపోతున్నారని చెప్పొచ్చు.