Begin typing your search above and press return to search.

అవును.. రేమండ్స్ జంట విడిపోయారు

తాజాగా భార్యతో విడిపోయిన విషయాన్ని రేమండ్స్ ఛైర్మన్ కం ఎండీ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:20 AM GMT
అవును.. రేమండ్స్ జంట విడిపోయారు
X

గడిచిన కొద్దికాలంగా అనధికారికంగా వస్తున్న వార్తలు నిజమన్న విషయం మరోసారి తేలింది. సినిమా ఇండస్ట్రీతో పాటు మరికొన్ని రంగాల్లో జంటలు విడిపోవటం మామూలే అయినా.. కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటివి కాస్త తక్కువగా కనిపిస్తాయి. బయట దేశాలతో పోలిస్తే మన దేశంలోని వ్యాపారవేత్తలు.. పారిశ్రామికవేత్తల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలు పెద్దగా బయటకు రావు. అందుకు భిన్నంగా ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థగా పేరున్న రేమండ్స్ ఛైర్మన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తగా మారింది. గతంలో తండ్రితో ఉన్న పంచాయితీ సంచలనమైతే.. తాజాగా భార్యతో విడిపోయిన విషయాన్ని రేమండ్స్ ఛైర్మన్ కం ఎండీ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తన భార్య నవాజ్ తో విడిపోయిన విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. రూ.11వేల కోట్ల నికర సంపద ఉన్న వ్యాపార ప్రపంచానికి అధిపతి అయిన ఆయన.. ఫిట్ నెస్ ట్రైనర్ అయిన నవాజ్ తో సాగిన 32 ఏళ్ల వైవాహిక జీవితానికి తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. 1999లో వీరికి పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. గత వారం థానేలో జరిగిన దీపావళి ముందస్తు పార్టీకి ఇన్విటేషన్ ఉన్నప్పటికీ నవాజ్ ను అనుమతించలేదన్న వీడియో ఒకటి వైరల్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే.. విడాకుల ప్రకటనను గౌతమ్ సింఘానికి స్వయంగా సోషల్ మీడియాలో పేర్కొనటం గమనార్హం.

ఇన్నాళ్లు ఒక విశ్వాసంతో కలిసి పయనించామని.. తమ జీవితాలకు అందమైన రెండు అద్భుతాలు జతయ్యాయని.. అయితే కొన్ని పరిణామాలు.. నిరాధార ఊహాగానాలను ఎక్కువ మంది వ్యాపింపజేశారని.. బహుశా వారు తమ శ్రేయోభిలాషులు కాదేమోనన్న ఆయన.. ఇకపై నవాజ్.. తాను వేర్వేరు దారుల్ని అన్వేషిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తమ పిల్లలు ఇద్దరికి అత్యుత్తమ జీవితాన్ని ఇవ్వటానికి మాత్రం తాము కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు.

విడిపోవటానికి కారణాల్ని కానీ.. పిల్లల బాధ్యత ఎవరిదన్న విషయాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రముఖ న్యాయవాది కుమార్తె అయిన నవాజ్ సైతం లా చదివారు. వ్యక్తిగత ఆసక్తితో ఆమె జిమ్ తెరిచారు. పెళ్లికి ముందు ఏనిమిదేళ్ల పాటు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని చెబుతారు. కొన్నేళ్ల క్రితం రేమాండ్స్ గ్రూప్ వ్యవస్థాపకుడైన తన తండ్రి విజయ్ పథ్ సింఘానియాతో గౌతమ్ కు విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చి కార్పొరేట్ ప్రపంచంలో ఆయన హాట్ టాపిక్ గా మారారు.తాజాగా మరో వ్యక్తిగత అంశంతో ఆయన పేరు వార్తల్లోకి ఎక్కింది.