Begin typing your search above and press return to search.

టీడీపీ నేతపై మనీలాండరింగ్‌ కేసు... రూ.9394 కోట్ల మోసం?

ఈ క్రమంలో తాజాగా రాయపాటి సాంబశివరావు 13 బ్యాంకుల నుంచి రూ. 9,394 కోట్ల రుణం తీసుకున్న ట్రాన్స్‌ ట్రాయ్‌..

By:  Tupaki Desk   |   3 Aug 2023 3:54 AM GMT
టీడీపీ నేతపై మనీలాండరింగ్‌  కేసు... రూ.9394 కోట్ల మోసం?
X

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. రాయపాటి సాంబశివరావు, మలినేని సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకులకు రూ.9394 కోట్లు రుణ ఎగవేతకు పాల్పడినట్లు ఈడీ అభియోగిస్తుంది.

దీంతో... టీడీపీ హయాంలో చంద్రబాబు అండ చూసుకుని బ్యాంక్‌ లను బురిడీ కొట్టించిన నేతల చరిత్ర ఒక్కొక్కటి బయటపడుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇప్పటికే పలువురు మాజీ టీడీపీ నేతలు అక్రమ వ్యాపారాలు, మనీ లాండరింగ్ కేసుల్లో చిక్కుకొన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా రాయపాటి సాంబశివరావు 13 బ్యాంకుల నుంచి రూ. 9,394 కోట్ల రుణం తీసుకున్న ట్రాన్స్‌ ట్రాయ్‌... అందులో కొంతమొత్తం పలు డొల్ల కంపెనీకి మళ్లించినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో దేశంలోనే పెద్ద లోన్ స్కామ్‌ లలో ఇది ఒకటి అని ఈడీ గుర్తించిందని అంటున్నారు. ఈ క్రమంలో విచారణలో మరికొంత మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం... టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు 13 బ్యాంక్‌ లలో రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఆ డబ్బుని షెల్ కంపెనీలకి తరలించారని ఈడీ అభియోగం అని తెలుస్తోంది. పనిమనిషులు, స్వీపర్లు, డ్రైవర్ల పేర్లను ఉపయోగించి రాయపాటి అండ్ కో బోగస్ కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించారని ఈడీ ఆరోపించింది.

అనంతరం తనకుటుంబానికి చెందిన ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌ కు ఈ నగదు బదిలీ చేయించారని ఈడీ గుర్తించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో పద్మావతి ఎంటర్‌ ప్రైజెస్, యూనిక్ ఇంజనీర్స్, బాలాజీ ఎంటర్‌ ప్రైజెస్, రుత్విక్ అసోసియేట్స్ వంటి సంస్థలను స్థాపించి.. వాటి ద్వారా రూ.6,643 కోట్లు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలిందని కథనాలొస్తున్నాయి.

2019లోనే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో తాజాగా మనీలాండరింగ్ కేసులో భాగంగా రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుందని సమాచారం.

ఇదే క్రమంలో టీడీపీలో ఒకప్పుడు కీలక నేతలుగా ఉన్న సుజనా చౌదరి, నామా నాగేశ్వర్ లపై కూడా అప్పట్లో ఇలాంటి కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నామా నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న రూ.80 కోట్ల 65 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అయితే అప్పట్లో మనీలాండరింగ్ కేసుల భయంతో చంద్రబాబు సూచనల మేరకు పలువురు టీడీపీ నేతలు ఆగమేఘాలపై రాజకీయంగా సేఫ్ జోన్ చూసుకున్నారని విమర్శలు బలంగా వినిపించాయ.

మరోపక్క విశాఖలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం కూడా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిందంటూ ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రామోజీరావు చైర్మన్ గా ఉన్న మార్గదర్శి లో కూడా చాలా అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎంపీ ఉండవల్లి ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ సీఐడీ మార్గదర్శిపై పలు కేసులు నమోదు చేసి విచారిస్తోన్న సంగతి తెలిసిందే.

దీంతో చంద్రబాబు చుట్టూ మొత్తం ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడే వారే ఉన్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇలాంటి వారంతా చంద్రబాబు అండచూసుకుని వేలకోట్లు పోగేస్తున్నారని.. దానికి చంద్రబాబు సపోర్ట్ కూడా ఉందని.. అలా సంపాదించిన సొమ్మును ఎన్నికల కోసం ఖర్చు చేసి బాబు రుణం తీర్చుకుంటుంటారని అంటున్నారు.

దీంతో... ఇలా చేస్తే పార్టీ రుణం, చంద్రబాబు రుణం తీరుతుందేమో కానీ... బ్యాంకులకు కట్టాల్సిన రుణం మాత్రం తీరదు కదా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.కాగా... మీమీద ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అని యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు దిగుతుందనే ఉద్దేశ్యంతో లోకేష్ చెప్పారని అనుకున్నా... తాజా పరిణామాలు చూస్తుంటే... తదాస్తు దేవతలు దీవించారా అనే సందేహం కలుగుతుందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.