Begin typing your search above and press return to search.

క్రిష్ణా బోర్డు... సీమ వర్సెస్ వైసీపీ !

ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ క్రిష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ కి లేఖ రాసారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:25 AM GMT
క్రిష్ణా బోర్డు... సీమ  వర్సెస్ వైసీపీ !
X

విశాఖకు గోదావరి జలాలకు సంబంధం ఉంది కానీ క్రిష్ణా జలాలకు సంబంధం ఏంటి అన్న ప్రశ్న వేస్తే ఏ రకమైన జవాబు లేదు. అలాంటి నిర్ణయం ఒకటి వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. ఇది వివాదం సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. క్రిష్ణా బోర్డుని ఏపీలో గోదావరి బోర్డుని తెలంగాణాలో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

అయితే ఏపీలో దీనిని క్రిష్ణా జలాలకు సంబంధించిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే సబబుగా ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విశాఖలో ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ క్రిష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ కి లేఖ రాసారు.

దానికి క్రిష్ణా బోర్డు ఆమోదం లభించాల్సి ఉంది. అయితే విషయం ఏంటి అంటే అసలు క్రిష్ణా బోర్డుకు విశాఖకు ఏమిటి లింక్ అని. విశాఖలో సౌకర్యవంతమైన భవనం ఒకటి ఏర్పాటు చేశామని అక్కడే బోర్డుని ఏర్పాటు చేయాలని ఏపీ క్రిష్ణా బోర్డు ని కోరడం పట్ల రాయలసీమ వాసులు మండిపడుతున్నారు.

అంతే కాదు క్రిష్ణా బోర్డుని వెంటనే విశాఖకు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఆ లేఖలో కోరడం విశేషం. నిజానికి క్రిష్ణా బోర్డుని రాయలసీమలో ఏర్పాటు చేయాలని సీమ వాసులు కోరుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కనీసం విజయవాడలో అయినా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిదని, ఇపుడు ఏమీ కాకుండా విశాఖకు దానిని తరలించడం ఏంటి అని సీమ వాసులు భగ్గుమంటున్నారు.

రాయలసీమ వైసీపీకి ఎంతో ఇచ్చిందని, 2014లో సైతం 29 సీట్లు వైసీపీ గెలుచుకుంటే టీడీపీ 23 సీట్లను గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు. ఇక 2019లో చూస్తే టీడీపీకి మూడంటే మూడు సీట్లు ఇచ్చి మొత్తం 49 సీట్లు వైసీపీకే ఇచ్చిందని అంటున్నారు. మరి అంతలా వైసీపీని హత్తుకుంటే ఆ పార్టీ ప్రభుత్వం సీమకు చేస్తున్న న్యాయం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

క్రిష్ణా బోర్డు విషయంలో టీడీపీ ప్రభుత్వమే నయమని కానీ వైసీపీ మరీ దారుణంగా వ్యవహరిస్తోందని సీమ ఉద్యమకారులు మండిపడుతున్నారు. సీమ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వైసీపీ వ్యవహరిస్తే ఇబ్బందులే వస్తాయని కూదా హెచ్చరిస్తున్నారు.

రాయలసీమలో వైసీపీ గట్టిగా ఉందని, అలాంటి దాన్ని పాడు చేసుకోవడానికి అన్నట్లుగా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే చివరికి రాజకీయంగా వైసీపీకి సీమలో బిగ్ ట్రబుల్స్ వస్తాయని అంటున్నారు. అయితే చాలా కాలంగా ఈ ఇష్యూ నలుగుతోంది, కానీ వైసీపీ మాత్రం విశాఖలోనే క్రిష్ణా బోర్డు ఏర్పాటుకు మొగ్గు చూపడం విశేషం. మరి వైసీపీ పట్టుదల వెనక కారణం ఏంటో వారికే తెలియాలి అంటున్నారు.