Begin typing your search above and press return to search.

టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి ?

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షాతో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయంగా కూడా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు.

By:  Satya P   |   13 Feb 2026 9:24 AM IST
టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి ?
X

తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎంత కీలకమో తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఎన్డీయే మూడవసారి వరసగా అధికారం చేపట్టడానికి కారణం తెలుగుదేశం అని ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశానికి 16 ఎంపీలు ఏపీ నుంచి ఉన్నారు. అలాగే ఆ పార్టీ మద్దతుతో కూటమిలో ఉన్న బీజేపీ మూడు, జనసేన రెండు ఎంపీ సీట్లు సాధించాయి. ఈ బలం అంతా బీజేపీకి ఎంతగానో అక్కరకు వచ్చింది.

రెండు పదవులతో :

ఇదిలా ఉంటే 2024 జూన్ 9న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించినపుడు ఏపీ నుంచి టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చారు. అదే విధంగా నామినేటెడ్ పదవులు కొన్ని దక్కాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయిన తరువాత కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు అని ప్రచారం సాగుతోంది.

ఓకే చెప్పారా :

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షాతో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయంగా కూడా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రివర్గం విస్తరణలో ఏపీకి ఒక బెర్త్ ఇస్తారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఆ పదవిని ఇవ్వడం ద్వారా ఎన్డీయేలో బీజేపీ తరువాత రెండో పెద్ద పార్టీ అయిన టీడీపీకి సముచితమైన న్యాయం చేసినట్లు అవుతుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.

సీమ నుంచేనా :

ఇక చూస్తే టీడీపీకి ఇచ్చే కేంద్ర మంత్రి పదవిని ఈసారి ప్రాంతాల వారీగా సామాజిక కోణంలో బేరీజు వేస్తూ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలా చూస్తే కనుక రాయలసీమకి చాన్స్ దక్కవచ్చు అని అంటున్నారు. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి ఇస్తారని అంటున్నారు దాంతో నంద్యాల ఎంపీగా ఉన్న బైరెడ్డి శబరికి మహిళా కోటాలో ఈ పదవి దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఏపీ నుంచి మహిళా కేంద్ర మంత్రి అయితే లేరు. గతంలో యూపీఏ హయాంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు.

మహిళలకు ప్రాధాన్యత :

ఉమ్మడి ఏపీలో చూస్తే టీడీపీ కేంద్రంలో పొత్తులు నెరపినపుడు రేణుకా చౌదరికి మహిళా కోటాలో చాన్స్ దక్కింది. ఈ క్రమంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. దాంతో శబరికి ఆ అవకాశం ఇస్తారని అంటున్నారు. విద్యాధికురాలుగా డాక్టర్ గా ఉంటూ పార్లమెంట్ లో ఎంపీగా గడచిన ఇరవై నెలలలో తనదైన శైలిలో ఆమె రాణిస్తున్నారు అని అంటున్నారు. బైరెడ్డి కుటుంబానికి కర్నూలు జిల్లాలో పట్టుంది. దాంతో వైసీపీకి చెక్ పెట్టేలా ఈ డెసిషన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.