ఇలా చేస్తే చాలదు ... 'అనంత' సెగ్మెంట్లు చాలా 'హాట్' .. !
రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన కూటమి నాయకులు.. మళ్లీ విజయం దక్కించుకోవాలంటే.. పైపైన పనిచేస్తే చాలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Garuda Media | 24 March 2026 6:00 AM ISTరాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన కూటమి నాయకులు.. మళ్లీ విజయం దక్కించుకోవాలంటే.. పైపైన పనిచేస్తే చాలదన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. గత ఎన్నికల్లో కూటమి హవాతో గెలిచిన వారు.. సంస్థాగతంగా వైసీపీపై ఉన్న వ్యతిరేకతతో నెట్టుకొచ్చిన వారు ఉన్నారు. కానీ, వాస్తవానికి అనంతలో నిర్దిష్టంగా గెలుపు గుర్రం ఎక్కాలంటే.. ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని.. ప్రజలను మెప్పించేలా వ్యవహరించాలని చాలా వరకు సూచనలు వస్తున్నాయి.
ఎక్కడెక్కడ..
ధర్మవరం: మంత్రి సత్యకుమార్ బీజేపీ టికెట్‌పైతొలిసారి విజయం దక్కించుకున్నారు. కానీ, ఇక్కడ వైసీపీ హవా మాత్రం పదిలంగా ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా.. వైసీపీ విజయానికి అవకాశం ఇచ్చినట్టే. పైగా సంస్థాగతంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ సానుభూతి పెరుగుతుండడం గమనార్హం. మంత్రిగా సత్యకుమార్ ఎక్కువ సమయం.. రాజధాని ప్రాంతంలోనే ఉంటున్నారు. నియోజకవర్గానికి పెద్దగా సమయం ఇవ్వడం లేదన్న చర్చ ఉంది.
కదిరి: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పనితీరుకు మంచి మార్కులు పడుతున్నా.. మరింత జోరు తప్పదన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే.. నికరంగా ఇక్కడ ఓటర్లు.. ఒకే పార్టీకి సానుకూలంగా లేక పోవడం.. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండడం గమనార్హం. దీనిని సొంతం చేసుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. అయినా.. మరింత ఎఫర్ట్ పెట్టక తప్పదని చెబుతున్నారు.
మడకశిర: టీడీపీ ఎస్సీ నాయకుడు ఎం.ఎస్ రాజు ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఈయన కూడా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేనే. మాస్ నాయకుడిగా పేరున్నా.. అన్ని వర్గాలకు చేరువ కాలేక పోతున్నారన్న వాదన ఉంది. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూస్తున్నారన్న వాదన సొంత పార్టీలోనూ వినిపిస్తోంది. పైగా.. ఇది వైసీపీకి బలమైన ఎస్సీ నియోజకవర్గం కావడం గమనార్హం.
రాప్తాడు: పరిటాల కుటుంబానికి పట్టుకొమ్మగా ఉ న్న ఈ నియోజకవర్గం .. 2019లో చేజారిపోయింది. అయితే.. అది తాత్కాలికమేనని.. తమదే హవా అని పరిటాల కుటుంబం భావిస్తోంది. కానీ, ప్రజల మాట.. చేత వేరేగా ఉంది. తమ సమస్యల పరిష్కారం వెనుకబడుతోందని వారు అంటున్నారు. ఇది క్షేత్రస్థాయి వాస్తవం. దీనిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ప్రత్యర్థులు ప్రస్తుతం సైలెంట్ అయినా.. ఎన్నికల సమయానికి విజృంభించడం ఖాయమని అంటున్నారు.
తాడిపత్రి: జేసీ కుటుంబానికి 35 ఏళ్లపాటు తిరుగులేని నియోజకవర్గంగా ఉన్న తాడిపత్రిలో 2019లో మార్పు వచ్చింది. వైసీపీ విజయం దక్కించుకుంది. మరి వచ్చే ఎన్నికల సంగతేంటి? అంటే.. యువ నాయకుడు, ఎమ్మెల్యే అస్మిత్ వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, ఆయన తడబడుతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిని సరిచేసుకుంటే.. మరోసారి విజయం దక్కించుకునే అవకాశం ఉంటుంది.
