Begin typing your search above and press return to search.

సీమ‌లో కూటమి నేతల ఎఫెక్ట్ ఎలా ఉంది..!

ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీల నాయ‌కుల వ్య‌వ హార శైలి ఎలా ఉంది? ఏయే ప్రాంతాల్లో నాయ‌కులు ఎలా ప‌నిచేస్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 8:00 AM IST
సీమ‌లో కూటమి నేతల ఎఫెక్ట్ ఎలా ఉంది..!
X

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీల నాయ‌కుల వ్య‌వ హార శైలి ఎలా ఉంది? ఏయే ప్రాంతాల్లో నాయ‌కులు ఎలా ప‌నిచేస్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూట‌మి నాయ‌కుల ప‌నితీరు ఎలా ఉన్నా.. అత్య‌ధికంగా సీట్లు ద‌క్కించు కున్న రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఎక్కువ‌గా వీరిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. వైసీపీకి కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కూటమి విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే దీనికి కార‌ణం.

రాయ‌ల సీమ‌లో మొత్తం 52 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో 45 స్థానాల్లో కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంది. కేవ‌లం 7 చోట్ల మాత్ర‌మే వైసీపీ విజ‌యం సాధించింది. గ‌త వైసీపీ హ‌యాంలో కేవలం రెండు చోట్ల మాత్ర‌మే టీడీపీ గెల‌వ‌గా.. 2024 ఎన్నిక‌ల స‌మయానికి మాత్రం భారీగా పుంజుకుంది. దీంతో వైసీపీకి కీల‌క‌మైన అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌డప జిల్లాలోనూ.. కూట‌మి గెలుపు గుర్రం ఎక్కింది.

మ‌రి ఈ ఏడాది కాలంలో ఇక్కడి నాయ‌కుల ప‌నితీరు ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? అనేది చ‌ర్చ‌. జిల్లాల వారీగా చూస్తే.. క‌డ‌ప‌లో నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డింద‌నే చెప్పాలి. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌డ‌ప ఎమ్మెల్యే దూకుడు కార‌ణంగా.. కార్య‌క‌ర్త‌లు, నాయకులు కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారు. నిజానికి క‌లుపుగోలు త‌నం త‌గ్గింద‌నే చెప్పాలి. ఇక‌, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి సొంత నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మిగిలిన చోట్ల కూడా ప‌రిస్థితి ఇలానే ఉంది.

క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి బాగానే ఉన్నా.. ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. గ‌త ఎన్నిక‌ల్లో జెండా మోసిన త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద ని చాలా మంది నాయ‌కులు కార్య‌కర్త‌లు వ‌గ‌రుస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ వైపు ప్ర‌జ‌లుమొగ్గు చూపు తున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. దీనికి ఖండించ‌లేని ప‌రిస్థితిలో కూట‌మి నాయ‌కులు ఉన్నారు. మ‌రి ఈ ఏడాది అయినా.. ఈ ప‌రిస్థితి మారుతుందో లేదో చూడాలి.