రాయచోటి సింగిల్ సైడేనా ..!
వైసీపీ సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం సహకారం అంతంత మాత్రంగానే ఉంది.
By: Garuda Media | 20 April 2026 8:00 PM ISTఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి విజయం సాధించి మంత్రి అయ్యారు. దీంతో టీడీపీ పుంజుకునే దశలో ఉంది. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని మండపల్లి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇటీవల రాయచోటిని మదనపల్లెలో కలిపినప్పుడు.. కొంత వ్యతిరేకత కనిపించినా.. దీనిని సర్దుబాటు చేసే క్రమంలో మంత్రి సక్సెస్ అయ్యారు. ఫలితంగా నియోజకవర్గంలో ఇప్పుడు సానుకూల పవనాలు వీస్తున్నాయి. అయినప్పటికీ.. వైసీపీ నేతగా ఉన్న గడికోట తనదైన చక్రం తిప్పుతున్నారు. దీంతో ఎవరు గెలిచినా.. మళ్లీ స్వల్పమెజారిటీతోనే గట్టెక్కుతారన్న చర్చ ఒకవైపు జరుగుతుండగా.. ఇరు శిబిరాల్లో నూ అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి.
మంత్రిగా..
మంత్రిగా మండపల్లి బిజీగా ఉన్నప్పటికీ.. నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు... ఆయన ప్రజలకు కూడా చేరువ అవుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో అయినా.. ఎమ్మెల్యేలు.. మంత్రు లు ఒకింత వెనుక బడుతున్నా.. రాయచోటిలో మాత్రం ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల నుంచి ప్రభుత్వ , పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మాత్రం ఎక్కడా వెనుకంజ వేయకుండా.. ముందుకు సాగుతున్నారు. సీఎంఆర్ ఎఫ్ ఫండ్స్ విషయంలోనూ.. బాధితులకు అండగా ఉంటున్నారు.
గడికోటకు గండి..!
వైసీపీ సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం సహకారం అంతంత మాత్రంగానే ఉంది. మంత్రిగా కూడా రెడ్డి నాయకుడే ఉండడం.. రాయచోటికి ఇటీవల కాలంలో మంత్రి పదవి దక్కడంతో ఇక్కడి రెడ్డి నాయకులు సహా.. వ్యాపారులు అందరూ.. మంత్రి వైపే ఉంటున్నారు. పార్టీల పరంగా ఎలా ఉన్నా.. ఆయనకే పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. ఈ పరిణామాలతో గడికోటకు ఇప్పుడున్న పరిస్థితి ఇబ్బందిగానే ఉందని అంటున్నారు.
