Begin typing your search above and press return to search.

ముప్పై వేల ఓట్ల మిస్టరీ... జగన్ క్లోజ్ ఫ్రెండ్ గుట్టు విప్పేశారా ?

ఏపీలో 2024 ఎన్నికల్లో చాలా మందికి అసాధారణ మెజారిటీలు వచ్చాయి. మామూలుగా అయితే ఎంపీలకు లక్ష ఓట్ల మెజారిటీలు వస్తాయి. ఎందుకంటే వారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఓట్లు పొందుతారు కాబట్టి.

By:  Tupaki Desk   |   10 Jun 2025 5:00 PM IST
ముప్పై వేల ఓట్ల మిస్టరీ... జగన్ క్లోజ్ ఫ్రెండ్ గుట్టు విప్పేశారా ?
X

ఏపీలో 2024 ఎన్నికల్లో చాలా మందికి అసాధారణ మెజారిటీలు వచ్చాయి. మామూలుగా అయితే ఎంపీలకు లక్ష ఓట్ల మెజారిటీలు వస్తాయి. ఎందుకంటే వారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఓట్లు పొందుతారు కాబట్టి. కానీ కేవలం రెండు లక్షల ఓటర్లు ఉన్న చోట ఏకంగా మెజారిటీలే లక్షలలో రావడం అంటే ఇదేదో మాయాజాలంగా ఉందని వైసీపీ నేతలు నాటి నుంచి అంటూనే ఉన్నారు.

ఇక ఈవీఎంల వల్లనే ఇదంతా జరిగింది. ఏదో జరిగి ఉంటుందని కూడా వైసీపీ నేతలు గత ఏడాదిగా ఆరోపిస్తున్నారు కానీ లాజిక్ తో కూడిన విమర్శలు అయితే చేయడం లేదు. ఆ లోటుని జగన్ సన్నిహిత నేత, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బయటపెట్టారు. ఆయన 2009 నుంచి అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలుస్తూ వస్తున్నారు.

అక్కడ ఆయనకు ఉన్న పట్టు అలాంటిది. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు బాగానే ఓట్లు వచ్చాయి. ఆయన ఓట్లు ఎక్కడా తగ్గిపోలేదు. కానీ ఆయన మాత్రం ఓడిపోయారు. ఇదెలా జరిగింది అంటే ఏకంగా ముప్పై వేల ఓట్ల పెరుగుదల 2019 నుంచి 2024 మధ్యలో కనిపించిందని ఇదేలా సాధ్యమని గడికోట తాజాగా సంధించిన ప్రశ్నలు ఏకంగా ఎన్నికల కమిషన్ సైతం ఆలోచించుకునేలా చేశాయని అంటున్నారు.

ఆయన వరసగా గత నాలుగు ఎన్నికల పోలింగ్ సరళి, ఓటర్ల వివరాలు సైతం వెల్లడిస్తూ 2024లో మాత్రమే అసాధారణ ఓటర్ల పెరుగుదల కనిపించిందని ఎత్తి చూపారు. అది కూడా ఏకంగా 30 వేల ఓట్లు అదనంగా పెరిగితే ఆ పెరిగిన మొత్తం ఓట్లు అన్నీ ఒక్క తెలుగుదేశం పార్టీకే పడి ఆ పార్టీ రాయచోటిలో విజయం సాధించింది.

ఈ పాయింట్ నే పట్టుకుని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఆయన లేవనెత్తుతున్న సందేహాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి చూస్తే కనుక 2014 నుంచి 2019 దాకా ఓటర్ల పెరుగుదల కేవలం 200 గానే ఉందని, కానీ 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 30 వేల ఓట్లు ఎలా పెరిగాయని నిలదీస్తున్నారు.

ఇక ఆ పెరిగిన ఓట్లలో కూడా అన్నీ గుత్తమొత్తంగా ఒకే పార్టీ అది కూడా టీడీపీకే పడిపోవడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తూంటే తనకు అనేక సందేహాలు అనుమానాలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 62 వేల ఓట్ల నుంచి 66 వేల ఓట్లు రాగా వైసీపీకి 92 వేల నుంచి 98 వేల ఓట్ల దాకా వచ్చాయి. అదే 2024లో తీసుకుంటే వైసీపీకి 95 వేల ఓట్లు వచ్చాయని టీడీపీకి మాత్రం 96 వేల ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. వైసీపీ ఓట్లు అలాగే ఉండగా, టీడీపీకి ఏకంగా 30 వేల ఓట్లు అదనంగా వచ్చి చేరాయని ఆయన వివరించారు.

ఒక వైపు ఓట్ల పెరుగుదల 30 వేల దాకా ఉండి అసాధారణంగా కనిపిస్తూంటే ఆ ఓట్లు అన్నీ కలసి ఒక్క టీడీపీకే పడడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అందుకే ఆయన ఒక డిమాండ్ చేస్తున్నారు 2012లో జరిగిన ఉప ఎన్నికల నుంచి 2014, 2019, 2024 ఎన్నికల దాకా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల మీద సమగ్రమైన పరిశీలన చేయాలని కోరుతున్నారు.

కేవలం అయిదేళ్ళ కాలంలో రాయచోటిలో అసాధారణంగా ఓట్ల పెరుగుదల ఉందని ఆ పెరుగుదల కూడా ఒకే ఒక పార్టీ టీడీపీకే కలసి వచ్చేలా టోటల్ ఓట్లు పడ్డాయని దాంతో ఈ ఎన్నికల్లో జరిగిన లోటు పాట్ల మీద అవకతవకల మీద పూర్తి విచారణ జరిపించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ ని పరిశీలిస్తుందా అన్నదే చూడాల్సి ఉంది. అయితే ఆయన లేవనెత్తిన దాంట్లో లాజిక్ పాయింట్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.