ఆ ఇద్దరితో చాలా డేంజర్.. రాయచోటి టెర్రరిస్టులపై బిగ్ అప్డేట్
ఇక తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దాదాపు 30 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతూ, అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడటంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు.
By: Tupaki Desk | 4 July 2025 9:46 AMరాష్ట్రంలో ఇటీవల ఉగ్రవాదుల అరెస్టులు సంచలనమవుతున్నాయి. విజయనగరం పేలుళ్లకు స్థానికుడు సిరాజ్ ప్రణాళిక వేయడం, కౌంటర్ ఇంటెలిజెన్స్ అప్రమత్తత వల్ల ఆ కుట్ర బయటపడటం తెలిసిందే. ఇక తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దాదాపు 30 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతూ, అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడటంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. రాయచోటిలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పేలుళ్లతో దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నారని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు.
రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిఖీ, మహ్మద్ అలీని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తమిళనాడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అన్నమయ్య జిల్లా పోలీసులు చాకచక్యంగా ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఉగ్రవాదుల నుంచి సంచలన సమచారం పోలీసులు సేకరించినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించారు. ఆల్ ఉమ్మా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు దేశంలో మూడు ప్రధాన నగరాలులో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు డీఐజీ ప్రవీణ్ తెలిపారు.
దక్షిణ భారత దేశంలోనే పెద్ద ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఉమ్మా ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఆలోచనల ప్రకారం నడుస్తుందని పోలీసులు చెబుతున్నారు. రాయచోటిలో పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారు ఎవరు? వారికి స్థానికంగా ఎవరైనా అనుచరులు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి 50 ఐఈడీ బాంబుల తయారీకి ఉపయోగపడే మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ వెల్లడించారు.
ఈ కేసును అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఉగ్రవాదులు స్థానికంగా కొందరిని రిక్రూట్ చేసుకుని శిక్షణ ఇచ్చారనే అనుమానాలను నిర్ధారించుకోవాల్సివుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయమై ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఇంటెలిజెన్స్ సంస్థల సహకారం తీసుకుంటున్నామని, ఉగ్రవాదుల కుటుంబ సభ్యుల పాత్రపైనా కొన్ని అనుమానాలు ఉన్నాయని డీఐజీ తెలిపారు. అబూబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లపై కూడా కేసులు నమోదు చేసినట్టు వివరించారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు. వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించామన్నారు డీఐజీ. ఇక ఉగ్రవాదులు ఇద్దరికీ సాంకేతిక నైపుణ్యం ఉందని చెబుతున్నారు. రాయచోటిలో స్థిరపడిన వీరు 2013లో బెంగళూరులోని మల్లేశ్వరంలో పేలుళ్లకు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు.