Begin typing your search above and press return to search.

అవును.. కానిస్టేబుల్ వాహనానికి చలానా వేసిన సీఐ

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు రాయచోటికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఒకరు. రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సీఐ ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2025 1:00 PM IST
అవును.. కానిస్టేబుల్ వాహనానికి చలానా వేసిన సీఐ
X

చట్టం ఎవరికైనా ఒక్కటే. చట్టం ముందు అందరూ సమానులే. ఇలాంటి మాటలు పుస్తకాల్లోనే తప్పించి.. వాస్తవంగా కనిపించని పరిస్థితి. ఎవరెన్ని చెప్పినా చట్టం కొందరి చుట్టమన్నట్లుగా వ్యవహరించే అధికారగణం తరచూ కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా రూల్ బుక్ ముందు ఎవరైనా ఒక్కటే అన్నట్లుగా స్పందించే వారు చాలా తక్కువ అంటే చాలా చాలా తక్కువమందే ఉంటారు. అలాంటి అతి తక్కువమందిలో ఒకడిగా వ్యవహరించారు ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి సీఎం.

పోలీసుల్లో ట్రాఫిక్ పోలీసుల మీద ఉండే కతలు అన్ని ఇన్ని కావు. వారు రోడ్డు మీదకు వచ్చేది ట్రాఫిక్ కంట్రోల్ కంటే కూడా చలానాలు వేయటం మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారని.. తమకు విధించిన టార్గెట్లు పూర్తి చేసేందుకు అదే పనిగా తమ చేతిలోని కెమెరాను వాడుతుంటారే తప్పించి.. ఇంకేమీ ఉండదన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇంతా చేసి.. తమకు కావాల్సిన వారిని.. అయినోళ్లను.. బడా బాబుల్ని మాత్రం పట్టించుకోకుండా సాదాసీదా జనాలపై తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తారన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అందుకు భిన్నంగా.. రోటీన్ కు తేడాగా వ్యవహరించారో పోలీసు అధికారి.ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఇలా అందరూ చేస్తే ఎంత బాగుండన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇంతకూ సదరు పోలీసు అధికారి చేసిందేమిటి? అంటారా? అక్కడికే వస్తున్నాం. వాహనం ఏదైనా సరే..దాని ముందు వెనుకా రెండు వైపులా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ ను డిస్ ప్లే చేయాల్సి ఉంటుంది. కొందరు నెంబరు ప్లేట్ స్థానంలో తనకు తోచిన రీతిలో బోర్డులు పెట్టేస్తుంటారు. ఆ కోవలోకి పోలీసులు కొందరు వస్తుంటారు.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు రాయచోటికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఒకరు. రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సీఐ ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన టూవీలర్ నెంబర్ ప్లేట్ మీద నెంబర్లను తీసేసి.. ‘పోలీస్’ అంటూ పెద్ద అక్షరాలతో ఎర్ర రంగుతో స్టిక్కరింగ్ చేయించుకున్నారు. తాను పోలీస్ అన్న విషయాన్ని దర్జాగా తన బండితో చాటి చెప్పుకునే సదరు టూవీలర్ ను.. దాని మీద ప్రయాణిస్తున్న పోలీస్ ను ఆపిన సీఐ.. అతడికి రూ.350 అపరాధ చలానాను విధించారు. ఈ పని చేసిన ట్రాఫిక్ సీఐ విశ్వనాథ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అన్నట్లుగా వ్యవహరించిన తీరు మిగిలిన పోలీసులకు ఆదర్శంగా మారాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.