Begin typing your search above and press return to search.

ఎలుకల దందా.. 800 మద్యం బాటిళ్లు గల్లంతు కథ..!

ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన ఒక విచిత్ర సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

By:  Tupaki Desk   |   15 July 2025 4:00 AM IST
ఎలుకల దందా.. 800 మద్యం బాటిళ్లు గల్లంతు కథ..!
X

ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన ఒక విచిత్ర సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో ఏకంగా 802 మద్యం బాటిళ్లు కనిపించకుండా పోగా.., వ్యాపారులు చెప్పిన సమాధానం అధికారులతో పాటు స్థానికులను కూడా షాక్‌కు గురిచేసింది. వారు చెప్పింది వింటే ఎవరైనా నవ్వకుండా ఉండలేరు.. "ఆ బాటిళ్లన్నింటినీ ఎలుకలు తాగేశాయి!"

- ఎలుకల నింద.. అధికారుల ఆగ్రహం

ఈ సంఘటన ధన్‌బాద్‌లోని బలియాపూర్ , ప్రధాన్ ఖుంటా ప్రాంతాల్లో చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమలులోకి తేనున్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు స్టాక్‌ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 800కి పైగా IMFL (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) బాటిళ్లు మాయం కావడంతో, అధికారులు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. అప్పుడు వ్యాపారులు "ఎలుకలు బాటిళ్ల మూతలు కొరికి, మద్యం వాసనతో మత్తు వచ్చి తాగేశాయి!" అని పేర్కొంటూ ఎలుకలకే నింద మోపారు.

ఈ వింత వాదనపై అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామలీల రవాణి తీవ్రంగా స్పందించారు. "ఇది చెత్త వాదన" అంటూ వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమైన మద్యం బాటిళ్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు. అంతేకాకుండా, నోటీసులు జారీ చేస్తామని కూడా హెచ్చరించారు.

ఇది ధన్‌బాద్‌లో మొదటిసారి కాదు!

ఆశ్చర్యకరంగా, ధన్‌బాద్‌లో ఎలుకలపై ఇలాంటి నిందలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్న 10 కిలోల భాంగ్ , 9 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పేర్కొంటూ సమాధానమిచ్చారు. ఆ కేసు కోర్టుకు కూడా వెళ్ళింది, అప్పట్లో కోర్టు కూడా ఈ వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కొత్త మద్యం పాలసీకి ముందు సంచలనం

ఝార్ఖండ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేనుంది. దీని ప్రకారం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, రెవెన్యూ వసూళ్లలో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యం. అయితే, ఈ విధానం అమల్లోకి రావడానికి ముందే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది.

ఈ ఘటనపై ప్రజలు నెట్టింట తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "ఇకపై ఎలుకల్ని రక్షించకూడదు.. మద్యం బానిసలుగా మారిపోతున్నాయి", "నష్టానికి బదులు ఎలుకలపై కేసు పెడతారా?" వంటి సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ కథ సరదాగా అనిపించినా.. ప్రభుత్వ స్టాక్ మద్యం ఎక్కడికి పోయింది అన్నదానిపై అసలు దర్యాప్తు జరగాలి. ఎలుకలపై నింద వేయడం ద్వారా అసలు కుట్రను దాచిపెట్టే ప్రయత్నం జరిగి ఉండవచ్చు. నిజానిజాలపై వెలుగు పడే వరకు ఈ వింత కథ మాత్రం ప్రజలకూ, మీడియాకు వినోదాన్ని అందిస్తూనే ఉంటుంది!