Begin typing your search above and press return to search.

కందిపప్పు అందక తెల్ల కార్డు తెల్లబోతోంది !

మొత్తం రేషన్ దుకాణాలను జనతా బజార్లుగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. జూన్ నెల అయితే రేషన్ దుకాణాలను బ్రహ్మాండంగా అలంకరించారు ఎంతో సుందరీకరించారు.

By:  Tupaki Desk   |   29 Jun 2025 10:00 AM IST
కందిపప్పు అందక  తెల్ల కార్డు తెల్లబోతోంది !
X

పప్పులకు రారాజు కందిపప్పు. పేదవారికి అది అందక మారాం చేస్తోంది. బహిరంగ మార్కెట్ లో కందిపప్పు కిలో ఏకంగా 120 రూపాయలుగా ఉంది. దాంతో సామాన్యులు కందిపప్పు వైపు తేరగా కూడా చూడలేకపోతున్నారు.

ఇక ప్రభుత్వ చౌక దుకాణాలలో కందిపప్పు ఇచ్చి చాలా కాలం అవుతోంది. జగన్ సీఎం గా ఉన్న టైం లో కొన్నాళ్ళు ఇచ్చినా ఆ తరువాత ఆపేశారు. ఎందుకో కారణాలు తెలియదు కానీ బియ్యం మాత్రమే ఇచ్చారు. అంతకు ముందు చూస్తే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాత్రం రేషన్ దుకాణాలకు స్వర్ణయుగం అని చెప్పాలి.

ఒకటి రెండు కాదు మొత్తం తొమ్మిది సరుకులను చౌక దుకాణాలలో ఇచ్చేవారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొమ్మిది దినుసుల కధ కాస్తా బాగా తగ్గింది. పంచదార కందిపప్పు అయినా ఇచ్చేవారు అనుకుంటే వైసీపీ హయాంలో కేవలం బియ్యం పంచదారా మాత్రమే ఇస్తూ వచ్చారు. ఇపుడు కూటమి పాలనలో కూడా అదే రకమైన పరిస్థితి అయింది అని అంటున్నారు.

మొదట్లో ఒకటి రెండు నెలలు కందిపప్పు ఇచ్చినా ఆ తరువాత ఎందుకో దానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఇక చౌక దుకాణాల వద్దనే రేషన్ సరుకులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి అదే విధంగా అమలు చేస్తోంది.

మొత్తం రేషన్ దుకాణాలను జనతా బజార్లుగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. జూన్ నెల అయితే రేషన్ దుకాణాలను బ్రహ్మాండంగా అలంకరించారు ఎంతో సుందరీకరించారు. అయినా దక్కింది మాత్రం బియ్యమే అని జనాలు నిట్టూర్చారు. పోనీ జూలై నెల నుంచి అయినా కందిపప్పు ఇస్తారు అనుకుంటే ఈ నెల కూడా లేదు చల్లని కబురు తాపీగానే చెబుతున్నారు.

ఇక చౌక దుకాణాలలో అయితే కందిపప్పు కేవలం 67 రూపాయలకే కిలో ఇస్తారు. దాంతో జనాలు ఆశగా చూస్తున్నారు. కానీ ఇపుడు చేదు వార్త వినిపించడంతో తెల్ల కార్డు దారులు అంతా షాక్ తింటున్నారు. ప్రభుత్వం పేదలను కరుణించాలని ఇకనైనా కందిపప్పుతో పాటు వంట నూనెని ఇతత కిరాణా దినుసులను చౌక దుకాణాల ద్వారా అందించాలని కోరుతున్నారు.

తెల్లకార్డు ఉందన్న ఆనందమే కానీ ఉత్త బియ్యమే ఇస్తున్నారు అని నిట్టూరుస్తున్నారు. బియ్యం సైతం తెలంగాణలో మాదిరిగా సన్న బియ్యంగా ఇస్తే జనాలు నూటికి నూరు శాతం ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు. మరో వైపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్న వారి సంఖ్య మూడు లక్షలకు పెరిగింది. ఈ నెల 30తో ఈ కేవైసీ గడువు పూర్తి అవుతుది కాబట్టి కొత్త కార్డులు మంజూరు చేస్తారా అని ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.