Begin typing your search above and press return to search.

తోపుదుర్తితో టీడీపీ నేతల మిలాఖత్..!! మరి పరిటాల సంగతేంటి? అనంత రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు

అనంత రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన పరిటాల కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.

By:  Tupaki Desk   |   27 Aug 2025 3:00 PM IST
తోపుదుర్తితో టీడీపీ నేతల మిలాఖత్..!! మరి పరిటాల సంగతేంటి? అనంత రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
X

రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ నేతల తీరు వేరుగా ఉంటుంది. అక్కడ ఏ పార్టీలో అయినా ఆధిపత్య పోరు కామన్ గా ఉంటుందని అంటారు. స్వపక్షంలో విపక్షం అన్నట్లు.. నేతలు తమ పార్టీల్లో సహచరులను దెబ్బతీసేందుకు వారి రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలుపుతుంటారు. ఈ వ్యవహారం రాయలసీమలోని ప్రతి నియోజకవర్గంలో కామన్ గా జరుగుతుంటుందని, కానీ, కొన్ని నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి ఉండటం మాత్రం రాజకీయంగా పెద్ద సంచలనమే అంటున్నారు. ప్రధానంగా టీడీపీలో బలమైన నేపథ్యం ఉన్న పరిటాల కుటుంబానికి గట్టి పట్టున్న రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

అనంత రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన పరిటాల కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీతను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు తోపుదుర్తి. ఆ తర్వాత రాప్తాడు తన అడ్డాగా చాటుకున్నారు. పరిటాల కుటుంబ రాజకీయం ముగిసిపోయిందని ప్రకటించారు. అయితే 2024 ఎన్నికల్లో ఫలితం తిరగబడటంతో తోపుదుర్తి వెనక్కి వెళ్లిపోయారు. పరిటాల సునీత మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. ఇక గత ఏడాదిగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుకు ప్రభుత్వం పావులు కదుపుతుందన్న ప్రచారం జరిగింది.

ఇలా ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి టీడీపీలో కొందరు నేతలు సహకరిస్తున్నారని ప్రకటించి పెద్ద రాజకీయ బాంబు పేల్చారు వైసీపీ బహిష్కృత నేత మహానందరెడ్డి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరులు తనను అంతం చేసే కుట్ర చేస్తున్నారని మహానందరెడ్డి తాజాగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలోనే తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని, ఈ విషయంపై అమెరికాలో ఉన్న తన అన్న కుమారుడుకి ఫోన్ చేసి మరీ బెదిరించారని మహానందరెడ్డి చెప్పారు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వారితో లోపాయికారీ ఒప్పందం చేసుకుని తనను అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.

మహానందరెడ్డి ఆరోపణలతో కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని మహానంద రెడ్డి ఆరోపిస్తే, ఆయన వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత వ్యవహారంగా చూసేవారని, కానీ ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అధికార పార్టీతో చేతులు కలిపారని ఆరోపించడమే అనేక సందేహాలకు తావిస్తోందని అంటున్నారు. తోపుదుర్తిపై ఆరోపణలు చేసిన మహానందరెడ్డి ఇదే సమయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో తనను అక్రమంగా అరెస్టు చేయించి హత్య చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి కుట్ర చేస్తున్నారని మహానందరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామం అనంతపురం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి హెచ్చరికగా భావించాలని అంటున్నారు.

పరిటాలకు వ్యతిరేకంగా టీడీపీలో ఓ వర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తితో చేతులు కలిపారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా టీడీపీలో జిల్లా రాజకీయాలను శాసించిన పరిటాల కుటుంబాన్ని ఎదిరించే సత్తా ఎవరికి ఉందని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో మహానందరెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తితోపాటు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటిపై ఒకే తరహా ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరూ చేతులు కలిపారా? లేక ఇద్దరూ తనకు రాజకీయ ప్రత్యర్థులుగా భావించి మహానందరెడ్డి ఇలా ఆరోపణలు చేశారా? అనే చర్చ జరుగుతోంది.