Begin typing your search above and press return to search.

కొత్త అవతారంలో ర్యాపిడో.. దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్-కం-గైడ్’ సేవలు

పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ అందాలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది

By:  Tupaki Desk   |   28 Nov 2025 1:00 AM IST
కొత్త అవతారంలో ర్యాపిడో.. దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్-కం-గైడ్’ సేవలు
X

పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ అందాలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా 'డ్రైవర్-కం-గైడ్' విధానాన్ని ఏపీ పర్యాటక శాఖ ఆవిష్కరించింది. సీఎం చంద్రబాబు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, రాపిడో సహ-వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి సమక్షంలో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ర్యాపిడో-ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య తదుపరి చర్చలు సఫాగా జరగడంతో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ కం గైడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ ద్వారా రాపిడోలో మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆతిథ్యం, భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే నెల నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో చారిత్రక, పర్యాటక స్థలాలపై ర్యాపిడో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి వారిని గైడులుగా కూడా వినియోగించుకుంటారు. ఇందుకోసం రాపిడో యాప్‌లోనే టూరిస్ట్ ఆటోలు/క్యాబ్‌లు, పర్యాటక సర్క్యూట్ల వివరాలు అందుబాటులో ఉండేలా మార్పులు చేయనున్నారు.

విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక కో-బ్రాండెడ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి పర్యాటక సేవలను సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం - ర్యాపిడీ సంయుక్తంగా నిర్ణయించాయి. దీనివల్ల క్యాబ్, ఆటో డ్రైవర్ల ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని పర్యాటకులకు మంచి అనుభూతి కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీ సాయంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్, పర్యాటక రవాణాలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం కాగా, ప్రపంచవ్యాప్తంగా అరుదైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీలో బైక్, ఆటో సర్వీసులను ర్యాపిడోతోపాటు ఓలా, ఉబర్ వంటి సంస్థలు అందిస్తున్నాయి. అయితే ర్యాపిడో మాత్రం గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి చొరవ చూపుతోంది. గత ఏడాది మహిళలను ప్రోత్సహించే విషయంలో ర్యాపిడో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సుమారు వెయ్యి మంది మహిళలు ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా కింద మరో పది వేల మందికి ఉపాధి కల్పించేందుకు ర్యాపిడో-ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రైవర్ కం గైడ్ సేవలను అందుబాటులోకి తేవడం వినూత్నంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చిన ఫలితంతో ఈ సేవలను మరింత విస్తరించే అవకాశం ఉందంటున్నారు.