Begin typing your search above and press return to search.

క్రూరమైన రేపిస్టుకు పుతిన్‌ క్షమాభిక్ష వెనుక ఇంత కథ ఉందా?

ఈ కేసు రష్యాలో దుమారం రేపింది, ఎందుకంటే ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్‌ చేసినప్పటికీ హాజరుకాలేదు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:04 AM GMT
క్రూరమైన రేపిస్టుకు పుతిన్‌ క్షమాభిక్ష వెనుక ఇంత కథ ఉందా?
X

గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తూనే ఉన్నారు.. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం రష్యా వ్యాప్తంగా దుమారానికి దారి తీస్తోంది. తన ప్రేయసిని అతి దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా, తీవ్ర చిత్రహింసలకు గురిచేసి 111సార్లు కత్తితో పొడిచి చంపిన ఒక వ్యక్తికి పుతిన్‌ క్షమాభిక్ష పెట్టారు. ఇది రష్యన్‌ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది

వివరాల్లోకి వెళ్తే.. 27 ఏళ్ల వ్లాడిస్లావ్‌ కన్యస్‌ 23 ఏళ్ల వెరా ఫెఖ్‌ టెలేవాతో డేటింగ్‌ చేస్తున్నాడు. అయితే అతడితో ప్రేమ ఇష్టం లేని ఆమె విడిపోతానని చెప్పింది. తన వస్తువులను తనకు తిరిగి ఇచ్చేయాలని కోరింది. దీంతో తీవ్రంగా కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. మూడున్నరగంటలపాటు తీవ్ర చిత్ర హింసలకు గురిచేశాడు. ఆ తర్వాత కత్తితో ఆమెను 111 సార్లు పొడిచాడు. ఆ తర్వాత ఇనుప ఫ్లెక్స్‌తో ఆమె గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన 2020లో సైబీరియాలో జరిగింది.

ఈ కేసు రష్యాలో దుమారం రేపింది, ఎందుకంటే ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్‌ చేసినప్పటికీ హాజరుకాలేదు. దీంతో ఆమెను రక్షించడంలో విఫలమయ్యారు.

కాగా నిందితుడు వ్లాడిస్లావ్‌ కన్యస్‌ కు గతేడాది జూలైలో 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. అయితే అతడు ఏడాది కూడా జైలులో ఉండకుండానే విడుదలయ్యాడు. ఈ మేరకు అతడికి రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ క్షమాభిక్ష పెట్టారు.

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తరఫున పోరాడినందుకు కృతజ్ఞతగా అతడిని విడిచిపెట్టారు. పుతిన్‌ తాజా నిర్ణయం రష్యన్లలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.

పుతిన్‌ నిర్ణయాన్ని బాధితురాలి తల్లి తీవ్రంగా ఖండించింది. క్రూరమైన అత్యాచారం చే యడంతోపాటు హత్య చేసిన నిందితుడికి క్షమాభిక్ష ఎలాపెడతారని నిలదీసింది. అలాంటి క్రూరుడికి ఆయుధాలు ఇచ్చి యుద్ధ రంగంలోకి ఎలా పంపిస్తారని ప్రశ్నించింది. అతడిలాంటి క్రూరమైన స్వభావం ఉన్న వ్యక్తి సమాజంలో ఉంటే మరెంతో మందిని చంపుతాడని ఆందోళన వ్యక్తం చేసింది. తనను కూడా చంపుతాడని.. అలాంటి వ్యక్తికి ఆయుధాలిచ్చి సమాజంలో స్వేచ్ఛగా వదిలేయడం ఏమిటని బాధితురాలి తల్లి నిప్పులు చెరిగింది.

రష్యన్లంతా పుతిన్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చింది. ఇలాంటి తప్పుడు నిర్ణయాలను ఖండించకపోతే రష్యన్‌ పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా నేరస్తుడిని అక్టోబర్‌ 28న జైలు నుంచి విడిచిపెట్టారు. అతడు ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తరఫున పాల్గొంటాడని చెబుతున్నారు.