Begin typing your search above and press return to search.

ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగం.. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షాక్, కలెక్టర్ కీలక ఆదేశాలు!

మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత ఆస్తిని పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు

By:  Tupaki Desk   |   7 Oct 2026 3:07 PM IST
ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగం.. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షాక్, కలెక్టర్ కీలక ఆదేశాలు!
X

మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత ఆస్తిని పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. గతకొన్నేళ్లుగా మాజీ ఎమ్మెల్యే రాపాక ఇంటి ఆవరణలో రోడ్డు నిర్మాణంపై వివాదం నెలకొంది. రాపాక ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మించారని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. జనసేన నేత వెంకటపతిరాజు వెలుగులోకి తెచ్చిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో మాజీ ఎమ్మెల్యే ఇంటికి రోడ్డు నిర్మించారని అధికారులు నివేదిక సమర్పించడంతో ఆ స్థలాన్ని పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ఆదేశించినట్లు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు చెందిన ప్రైవేటు స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ పేరున రిజిస్టర్ చేయాలని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఎన్నడూ ఇటువంటి ఉదంతం చోటుచేసుకోలేదని పరిశీలకులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించడంతో కఠిన చర్యలకు ఆదేశించినట్లుగా చెబుతున్నారు. గతంలోనే కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని అంటున్నారు. దీంతో జనసేన నేత వెంకటపతిరాజు మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం కత్తిమండలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నివాసానికి గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మించారు. సుమారు 9 సెంట్ల ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ డబ్బుతో రోడ్డు నిర్మించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రజల రాకపోకల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, మాజీ ఎమ్మెల్యే ఆ రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఫిర్యాదులు చేశారని చెబుతున్నారు. ఈ విషయమై జనసేన నేత వెంకటపతిరాజు గట్టిపోరాటం చేయడంతో కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని అంటున్నారు. దీనిపై విచారించిన కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే నివాసానికి గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ చింతా అనురాధకు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.12 లక్షలు కేటాయించినట్లు గుర్తించారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగమైనట్లు నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. గత ప్రభుత్వంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీకి అనుబంధ సభ్యుడిగా మారిపోవడంతో చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే రాపాక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో జనసేన నేత వెంకటపతిరాజు పోరాటం కొనసాగించడంతో కలెక్టర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కలెక్టర్ ఉత్తర్వులతో రెండు వారాల్లోగా స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని, రోడ్డుకు అడ్డుగా నిర్మించిన గేటును తొలగించాల్సివుందని అంటున్నారు. అయితే రెండు వారాల సమయం ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే రాపాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. కలెక్టర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.