Begin typing your search above and press return to search.

ఆ సార్‌.. ఏ పార్టీలో ఉన్నారో...?

కొంద‌రు నాయ‌కుల ప‌రిస్థితి చిత్రంగా మారుతోంది. రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. ఎవరూ.. శాశ్వ‌త శ‌త్రువులు కూడా ఉండ‌రు.

By:  Garuda Media   |   1 Jun 2026 9:51 AM IST
ఆ సార్‌.. ఏ పార్టీలో ఉన్నారో...?
X

కొంద‌రు నాయ‌కుల ప‌రిస్థితి చిత్రంగా మారుతోంది. రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. ఎవరూ.. శాశ్వ‌త శ‌త్రువులు కూడా ఉండ‌రు. ఈ క్ర‌మంలో.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏ అవ‌స‌రానికి ఆ అవ‌స‌రం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కులు పెరుగుతున్నారు. ఇలాంటి వారిలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా స‌హా.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఇద్ద‌రు నాయ‌కుల గురించి త‌ర‌చుగా చ‌ర్చ జ‌రుగుతోంది. వారు ఏ పార్టీలో ఉన్నార‌న్న‌ది సందేహం. దీనిపై వారి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం లేదు.

రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో జ‌న‌సేన త‌ర‌ఫున గెలిచిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్.. ఒకే ఒక్క‌డుగా నిలిచారు. నిజానికి ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున పోటీచేసిన నాయ‌కులు అంద‌రూ ప‌రాజ‌యం పాల‌య్యారు. కానీ, రాపాక ఒక్క‌రే విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, త‌ర్వాత కాలంలో వైసీపీలోకి వ‌చ్చారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు వైసీపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. దీంతో కూట‌మి దూకుడు నేప‌థ్యంలో రాపాక ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఇక‌, ఆ త‌ర్వాత వైసీపీ కూడా ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఇక‌, అప్ప‌టి నుంచి రాపాక రాజ‌కీయాలు మారి పోయాయి. ఆయ‌న ఎటువైపు ఉన్నార‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. జ‌నసేన‌లోకి తిరిగి వ‌చ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు కొన్నాళ్లు చ‌ర్చ సాగింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణే ప్ర‌స్తావించారు. అయితే.. పేరు పెట్టి ఎక్క‌డా రాపాక పై కామెంట్లు చేయ‌క‌పోగా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఇలాంటి నాయ‌కుల‌ను తిరిగి తీసుకునేది లేదని వ్యాఖ్యానించారు. ఇటు వైసీపీకి దూరంగా ఉన్న రాపాక‌.. ఎన్నిక‌ల నాటికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

ఇక‌, ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన సీనియ‌ర్ నాయ‌కుడు, కాపు సామాజిక వ‌ర్గం నేత‌.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమంచి కాంగ్రెస్‌లో చేరారు. కానీ, ఓట‌మి త‌ర్వాత‌.. ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న తిరిగి వైసీపీలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ.. ఆయ‌న నుంచి ఎలాంటి స‌మాధానం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇలానే ఉంటారో.. మ‌ధ్య‌లోనే పార్టీ మారుతారో చూడాలి.