Begin typing your search above and press return to search.

అత్తా-కోడ‌ళ్ల ఆస్తి పైట్ పై కోర్టు ఏమందంటే?

హైకోర్టు మెట్లెక్కిన ఈ వివాదం చివరకు అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. అయితే, చట్టపరమైన తీర్పుల కంటే పరస్పర అవగాహనతో ముందుకు సాగడమే సమస్యకు శాశ్వత పరిష్కారమని కోర్టు భావిస్తోంది.

By:  Srikanth Kontham   |   27 April 2026 7:52 PM IST
అత్తా-కోడ‌ళ్ల ఆస్తి పైట్ పై కోర్టు ఏమందంటే?
X

సంజయ్ కపూర్ ఆస్తుల విషయంలో ఆయన తల్లి రాణి కపూర్ - భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్ మధ్య కొంత కాలంగా ఆస్దివివాదం నడుస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుదీర్ఘ వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని సూచించింది. మధ్యవర్తిత్వం వహించాలని ఇరు పక్షాలను ఆదేశించింది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కంటే సామరస్యంగా సమస్యను ప‌రిష్క‌రిం చుకోవ‌డ‌మే శ్రేయస్కరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాణి కపూర్‌ను ఉద్దేశించి కొన్ని భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు.

`మీ వయసు ఇప్పుడు 80 ఏళ్లు. ఈ వయసులో కోర్టులలో పోరాటాలు చేయడం సరైనది కాదు. జీవితం చివరి అంకంలో ప్రశాంతంగా ఉండాలి` అని పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇలా ఆస్తుల కోసం న్యాయపోరాటం చేయడం పట్ల కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ వివాదం వల్ల విలువైన సమయం, మానసిక ప్రశాంతత దెబ్బతింటాయని గుర్తు చేసింది. గత కొంతకాలంగా సంజయ్ కపూర్ ఆస్తి హక్కుల విషయంలో అత్తాకోడళ్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ఖరీదైన నివాసం , ఇతర ఆస్తుల పంపిణీ విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.

హైకోర్టు మెట్లెక్కిన ఈ వివాదం చివరకు అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. అయితే, చట్టపరమైన తీర్పుల కంటే పరస్పర అవగాహనతో ముందుకు సాగడమే సమస్యకు శాశ్వత పరిష్కారమని కోర్టు భావిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఇరు పక్షాలు మధ్యవర్తిత్వానికి అంగీకరించాయి. ఒక సీనియర్ మధ్యవర్తి సమక్షంలో కూర్చుని తమ మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుని ఆస్తి పంపకాలను కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కుటుంబ విలువలకు పెద్దపీట వేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆస్తుల కంటే అనుబంధాలే మిన్న అని ఈ కేసు ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. 80 ఏళ్ల వయసులో ప్రశాంతతను కోరుకోవాలని కోర్టు చేసిన సూచన కేవలం ఆ కుటుంబానికే కాక‌ ఇలాంటి వివాదాల్లో ఉన్న ఎందరికో ఒక సందేశంలాంటిది. అన్నింటికి డ‌బ్బే మూలం అన్న అంశం మ‌రోసారి ఫేమ‌స్ అత్తా కొడ‌ళ్ల మ‌ద్య కూడా హైలైట్ అయింది.అంతిమంగా కేసు విచారణలో న్యాయస్థానం చూపిన చొరవ చట్టపరమైన పరిష్కారానికే పరిమితం కాకుండా నైతిక విలువల ప్రాధాన్యతను కూడా నొక్కి చెప్పింది. ఆస్తులు అనేవి భౌతికమైనవని. కానీ వయసు మళ్లిన కాలంలో అవసరమైనది ఆత్మీయత , ప్రశాంతత అని కోర్టు గుర్తుచేసింది.