ఐటీ, రియల్ ఎస్టేట్ బూమ్‌తో ఈ జిల్లాకు వలసల వెల్లువ
రంగారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా జిల్లా జనాభా గణనీయంగా పెరుగుతోంది.
By: Tupaki Desk | 11 July 2025 7:00 PM ISTరంగారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా జిల్లా జనాభా గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో రంగారెడ్డి ముందు వరుసలో నిలుస్తోంది. ఇదే కారణంగా ఇక్కడ నివాసానికి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది.
2011 నుంచి ఇప్పటి దాకా జనాభా పెరుగుదల
2011 జనాభా లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 24,46,265 మంది నివసించేవారు. వీరిలో 12,54,184 మంది పురుషులు కాగా, 11,92,081 మంది మహిళలు. కానీ ఆ తర్వాతి సంవత్సరాల్లో జిల్లా అభివృద్ధి చెందడం, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల జనాభా విపరీతంగా పెరిగింది. 2023 నవంబర్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 18 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఏకంగా 35,23,219 కు చేరింది. ఇది చూసినప్పుడు మొత్తం జనాభా 48 లక్షల వరకు చేరిందని జనగణన నిపుణులు అంచనా వేస్తున్నారు.
-వలసలతో వేగంగా పెరుగుతున్న జిల్లా
హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఈ జిల్లాలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు పెరిగాయి. దీంతో ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారు. అంతేకాదు హౌసింగ్ ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్ల బూమ్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఇవన్నీ కలిసే జిల్లాలో జనాభా వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
- నగరీకరణతో కొత్త డెవెలప్మెంట్
రంగారెడ్డి జిల్లా కొన్ని ప్రాంతాలు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోకి చేరగా మరికొన్ని పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్, విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి చూస్తుంటే, జనాభా పెరగడం సహజమనే చెప్పాలి.
జనాభా పెరుగుదలతో జిల్లా అభివృద్ధి నిరూపితమవుతుంది. అయితే ఈ వేగం కొనసాగితే మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల పాలకులు ముందుగానే ప్రణాళికలు రచించి, మౌలిక వసతులను మెరుగుపరచాలి. కానీ ఒక సంగతి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు రంగారెడ్డి జిల్లాకు "తగ్గేదేలే!" అన్నట్టుగా దూసుకుపోతోంది..
