దేశంలో ఉగ్ర కలకలం.. రాంచీలో ISIS శిబిరం
ఈ శిబిరం ద్వారా స్థానిక యువకులను రాడికలైజ్ చేసి ఉగ్రశాఖలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. శిక్షణలో భాగంగా బాంబు తయారీ, ఆయుధ వినియోగం, గుప్త నెట్‌వర్క్ నిర్మాణం బయటపడింది.
By: A.N.Kumar | 20 Sept 2025 7:42 PM ISTదేశంలో మళ్లీ ఉగ్ర కలకలం రేపిన ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం భారీ ఆపరేషన్ నిర్వహించి, నగర శివారులో సుదీర్ఘంగా పనిచేస్తున్న ISIS రిక్రూట్మెంట్ శిబిరాన్ని పట్టుకుంది. ఇటీవల అరెస్టయిన అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ సాగింది.
అరెస్టుతో బయటపడిన గుట్టు
డానిష్‌ను కఠినంగా విచారించగా.. అతను రాంచీలోని ఓ గుప్త స్థలంలో ఉగ్ర శిక్షణ శిబిరం కొనసాగుతోందని వెల్లడించాడు. వెంటనే సమాచారాన్ని ధృవీకరించిన పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటైన దళంతో ఆ శిబిరంపై దాడి జరిపారు.
స్వాధీనం చేసిన ఉగ్ర సామగ్రి
దాడిలో పోలీసులు పెద్దఎత్తున బాంబుల తయారీలో ఉపయోగించే రసాయన పదార్థాలు, పేలుడు వస్తువులు, ఆధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే శిక్షణ కోసం వాడిన కొన్ని డిజిటల్ పరికరాలు, రహస్య పత్రాలు కూడా అధికారులు చేతికి చిక్కాయి.
*ఆపరేషన్‌పై అధికారుల వివరాలు
ఈ శిబిరం ద్వారా స్థానిక యువకులను రాడికలైజ్ చేసి ఉగ్రశాఖలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. శిక్షణలో భాగంగా బాంబు తయారీ, ఆయుధ వినియోగం, గుప్త నెట్‌వర్క్ నిర్మాణం బయటపడింది. రాంచీతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ ఉగ్ర నెట్‌వర్క్ విస్తరించించాలన్న ప్రణాళికలు ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి.
*భద్రతా చర్యలు కఠినతరం
ఈ పరిణామంతో రాంచీ సహా జార్ఖండ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతా చర్యలు పెంచబడ్డాయి. నగరంలోని కీలక ప్రాంతాలలో పోలీసుల పహారా బిగించింది.
*ప్రభుత్వ దృఢ సంకల్పం
దేశ భద్రతను కుదిపేస్తున్న ఉగ్రవాద శక్తులపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి శిబిరాలపై గట్టి నిఘా వేసి, మరిన్ని ఆపరేషన్లు చేపట్టనున్నట్లు అధికారులు సూచించారు.
ప్రజలకు హెచ్చరిక
భద్రతా విభాగాలు పౌరులను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశాయి. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ ఆపరేషన్ ద్వారా రాంచీలోని ISIS శిబిరం బస్టు కావడంతో ఉగ్రవాదుల కుట్రలకు పెద్ద దెబ్బ తగిలింది. కానీ నెట్‌వర్క్ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యిందా అన్నది రానున్న రోజుల్లోనే స్పష్టం కానుంది.
