రాణా తీసుకురావటం ఓకే.. అసలైన విజయం హెడ్లీ వచ్చినప్పుడే
78 గంటల పాటు 10 మంది ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబయి మీద చేసిన దాడి.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న మరణాలు.. దారుణ హింస చరిత్రలో మర్చిపోలేనిది.
By: Tupaki Desk | 12 April 2025 10:36 AM IST78 గంటల పాటు 10 మంది ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబయి మీద చేసిన దాడి.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న మరణాలు.. దారుణ హింస చరిత్రలో మర్చిపోలేనిది. పోయిన ప్రాణాల కుటుంబాలు తమ జీవితాల్లో కోలుకోలేని దెబ్బగా మారిన ఈ మారణహోమానికి కర్త..కర్మ.. క్రియ లాంటోళ్లను అస్సలు వదిలిపెట్టకూడదు. పట్టుదలతో ప్రయత్నిస్తూ ఎట్టకేలకు కీలక కుట్రదారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణాను భారత్ కు తీసుకురావటం దౌత్య విజయమే. ఇతడితో పాటు ఈ మొత్తం మారణహోమానికి మాస్టర్ మైండ్ గా పేర్కొనే డేవిడ్ హెడ్లీని భారత్ కు తీసుకురాగలిగితే.. అసలైన విజయం సొంతమైనట్లుగా చెబుతున్నారు.
రాణా తీసుకురావటం వల్ల జరిగే మేలు కంటే.. హెడ్లీని భారత్ కు తీసుకొస్తే జరిగే మేలు ఎంతో ఎక్కువంటారు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై. రాణా పాత్రను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. రానున్న పది రోజుల్లో ఎన్ఐఎన్ విచారణలో అతడు వెల్లడించే నిజాలు.. ఇప్పటివరకు మన దగ్గర ఉన్న వివరాల్ని క్రాస్ చెక్ చేసుకోవటానికి సాయం చేస్తాయని మాత్రం చెప్పక తప్పదు.
ముంబయి మారణహోమంలో రాణా పాత్ర కంటే డేవిడ్ కోల్మన్ హెడ్లీ పాత్రే ఎక్కువ. అయితే.. రాణాను అప్పగించే విషయంలో సానుకూలంగా స్పందించిన అమెరికా.. హెడ్లీ విషయంలో మాత్రం అగ్రరాజ్యం స్పందిచని వైనం తెలిసిందే. దీనికి కారణం.. హెడ్లీ అనేటోడు అమెరికా మాదకద్రవ్య నియంత్రణ విభాగానికి ఏజెంట్ గా వ్యవహరించాడు. అంతేనా.. ఐఎస్ఐకు.. లష్కరే తోయిబా లాంటి సంస్థలకూ ఏజెంట్ గా పని చేశాడు. అవన్నీ అమెరికా నిఘా వర్గాలకు తెలుసు. అలాంటి కీలకమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తే.. సమాచారం పెట్టెను తమ చేతులతో భారత్ కు అప్పజెప్పినట్లు అవుతుంది. అందుకే.. కావాలనే హెడ్లీ ఉదంతాన్ని ప్రస్తావించినప్పుడు మౌనంగా ఉంటోంది.
ముంబయి మారణకాండ పథక రచన మొదలు అన్ని విషయాలు హెడ్లీకి తెలుసు. అలా అని రాణా తక్కువేం కదు. నిజానికి భారత్ లో తాను సేకరించిన సమస్త సమాచారాన్నీ.. ముంబయికి చెందిన జీపీఎస్ లొకేషన్లను హెడ్లీకి అందించింది ఇప్పుడు తీసుకొచ్చిన రాణానే. ఇతడిచ్చిన సమాచారాన్ని తీసుకొన్న హెడ్లీ పాకిస్తాన్ కు వెళ్లి.. అక్కడి నిఘా సంస్థలతో పని చేసే మేజర్ ఇక్బాల్ కు అందించారు. ఈ విషయాన్ని మన నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి.
అంతేకాదు.. ఉగ్రవాదులకు ఐఎస్ఐ ఇచ్చే శిక్షణ ఏమిటో హెడ్లీకి తెలుసు. ముంబయి ఉగ్రదాడికి సంబంధించి వివరాలు అమెరికా భద్రతా సంస్థలకు ముందే తెలిసినా.. మన దేశాన్ని ఎందుకు అప్రమత్తం చేయలేదో ఇప్పటికి మిస్టరీ. ఇలాంటి వేళ.. హెడ్లీని భారత్ కు అప్పజెప్పటం ద్వారా.. లేని వివాదాన్ని నెత్తి మీద వేసుకున్నట్లు అవుతుంది.అందుకే.. అతడ్ని భారత్ కు అప్పగించే విషయంలో అమెరికా అస్సలు స్పందించదన్న విషయం తెలుసు.
హెడ్లీ ఎంత డేంజర్ అన్న విషయాన్ని అతడి కేసుల్ని న్యాయస్థానంలో న్యాయమూర్తి హోదాలో కూర్చొని.. అతడికి35 ఏళ్ల జైలుశిక్ష విధించిన జడ్జి ఏమన్నారంటే.. హెడ్లీ ఉగ్రవాదని.. అతడ్ని ప్రజల నుంచి రక్షించటం తన విధిగా చెప్పుకున్నారు. అతడికి మరణశిక్షకు నిజమైన అర్హుడని.. ప్రభుత్వం నుంచి వచ్చిన వినతితో 35ఏళ్ల జైలుశిక్షను విధిస్తున్నట్లుగా ప్రకటించారు. అతడికి వేసే శిక్షలోనే డిస్కౌంట్ అడిగిన అమెరికా అధికారులు.. భారత్ కు అప్పగించే అంశంలో ఎందుకు సానుకూలంగా ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పక తప్పదు.
