Begin typing your search above and press return to search.

రాములమ్మ‌...కాంగ్రెస్ పిల‌వ‌దు మీరే వెళ్లి చేరాలి

25 సంవత్సరాల తన రాజకీయ ప్రయాణం .. అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణే ఇచ్చిందని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 6:26 AM GMT
రాములమ్మ‌...కాంగ్రెస్ పిల‌వ‌దు మీరే వెళ్లి చేరాలి
X

తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్యంగా బీజేపీ కేంద్రంగా జ‌రుగుతున్న అంత‌ర్గ‌త కుంప‌ట్ల‌లో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు మాజీ ఎంపీ విజ‌య‌శాంతి. దీనికి కార‌ణం గత కొన్ని రోజులుగా విజయశాంతి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీలో త‌న‌కు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని.. ఆమె పార్టీ మారుతారనే ప్రచారంకూడా జరిగింది. దీంతో ఆమెకు తెలంగాణ బీజేపీ నిరసనల కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆమె పెద్ద‌గా యాక్టివ్ మోడ్‌లో లేరు. ఈ క్ర‌మంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి తన 25 ఏళ్ల పొలిటికల్ జర్నీపై ఆసక్తికర్ ట్వీట్ చేశారు.

25 సంవత్సరాల తన రాజకీయ ప్రయాణం .. అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణే ఇచ్చిందని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏనాడు పదవి కోరుకోలేదని..ఇపుడు కూడా కోరుకోవడం లేదన్నారు. ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యమని చెప్పారు. మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుదామని కాదన్నారు. తన పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వం పైనేన‌ని తనతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని తెలిపారు. రాజకీయ పరంగా విభేదించినప్పటీకి.. అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకోవటమే తన ఉద్దేశ్యమని అన్నారు.

కాగా బీజేపీ నాయ‌క‌త్వంతో విభేదిస్తున్న రాముల‌మ్మ ఆ పార్టీపై అడ‌పాద‌డ‌పా అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఆ పార్టీలో కొన‌సాగే బ‌దులుగా తాజాగా పార్టీ మారిన వివేక్ వ‌లే న‌చ్చ‌క‌పోతే బ‌య‌ట‌కు పోవ‌చ్చున‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ పెట్టారు. పార్టీలో ఉంటూ పార్టీ విధానాల‌ను త‌ప్పు ప‌ట్టే బ‌దులుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే ఆప్ష‌న్ కూడా ఉంద‌ని పేర్కొంటున్నారు. ఇంకొంద‌రైతే.... త‌మ పార్టీలో చేరాల‌ని కాంగ్రెస్ ఇప్పుడు ఆహ్వానించ‌ద‌ని రాములమ్మ వెళ్లి చేరాల‌ని సూచిస్తున్నారు.