Begin typing your search above and press return to search.

భూమి గుండ్రంగా ఉందంటున్న రాములమ్మ...!

అయితే తెలంగాణా ఉద్యమం ఊపందుకోవడంతో ఆమె తల్లి తెలంగాణా పార్టీ పెట్టి సొంత రాజకీయం చేస్తూ వచ్చారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:49 PM GMT
భూమి గుండ్రంగా ఉందంటున్న రాములమ్మ...!
X

నిన్నటి తరం వెండితెర లేడీ సూపర్ స్టార్. పొలిటికల్ గా ఫైర్ బ్రాండ్ లేడీ అయిన విజయశాంతి మరోసారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమె కాంగ్రెస్ ప్రవేశం చేయడం ఇది రెండవసారి. అంతే కాదు, 2018 ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆమె కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా అప్పట్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఆ తరువాత బీజేపీలో చేరి గడచిన నాలుగేళ్ళ పాటు కమలం నీడలో ఉన్నారు. అయితే ఆమెకు బీజేపీ కూడా కొత్త కాదు. అప్పటికే బీజేపీలోకి రెండవసారి వచ్చారు. 1998 ప్రాంతంలో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి మొదట చేరింది బీజేపీలోనే. ఆమె వాజ్ పేయ్ అద్వానీ సారధ్యంలోని బీజేపీలో పనిచేశారు. అయితే తెలంగాణా ఉద్యమం ఊపందుకోవడంతో ఆమె తల్లి తెలంగాణా పార్టీ పెట్టి సొంత రాజకీయం చేస్తూ వచ్చారు.

ఇక టీయారెస్ ఉద్యమ పార్టీగా ముందుకు రావడంతో అందులో తన పార్టీని విలీనం చేసి టీయారెస్ లో ఆమె కీలకంగా మారారు. 2009లో ఆమె మెదక్ నుంచి టీయారెస్ ఎంపీగా గెలిచారు. ఆమె మొత్తం పాతికేళ్ళ రాజకీయ జీవితంలో అదే తొలి అధికార పదవిగా ఉంది. 2014 తరువాత ఆమె కాంగ్రెస్ లోకి వచ్చారు. 2018 ఎన్నికల తరువాత ఆ పార్టీని వీడారు.

ఇపుడు మళ్లీ ఖద్దరు పార్టీకి జై అన్నారు. మొత్తంగా చూస్తే విజయశాంతి బీజేపీ కాంగ్రెస్ లలో రెండేసి సార్లు చేరినట్లు అయింది. బీయారెస్ లో ఒకసారి మాత్రమే ఉన్నారు. ఇక సొంత పార్టీ కూడా పెట్టి విలీనం చేశారు కాబట్టి ఆ ముచ్చట ఇక మీదట ఉండకపోవచ్చు అంటున్నారు.

విజయశాంతి కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఆమె భవిష్యత్తుకు తగిన విధమైన భరోసా అందడమే అంటున్నారు. ఆమెను 2024 ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి పోటీ చేయిస్తారు అన్న హామీ ఉంది. అందుకే ఆమె కాంగ్రెస్ లో చేరారు అని అంటున్నారు. ఆమె రేపటి నుంచి కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే విజయశాంతి రాజకీయంగా అనుకున్న లక్ష్యం ఏమిటి ఆమె దాన్ని చేరుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆమె ముఖ్యమంత్రి అవాలని తొలి రోజుల్లో భావించేవారు. ఆమెకు ఆదర్శనీయ రాజకీయ నాయకురాలు జయలలిత. ఆమె మహిళా సీఎం గా తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించాలని అనుకున్నారు.

బీయారెస్ లో అది తీరదు కనుక బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను ఆశ్రయించారు. అయితే ఆయా పార్టీలు ఆమె సేవలను పూర్తిగా వినియోగించుకున్నాయా అన్నది ఒక ప్రశ్న అయితే విజయశాంతి ఎంతవరకూ ఆయా పార్టీలలో ఇమిడిపోయారు అన్నది మరో ప్రశ్న. ఏది ఏమైనా విజయశాంతి రాజకీయం చూస్తే భూమి గుండ్రంగా ఉంది అన్నట్లుగా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు అని అంటున్నారు. ఇది ఆమె రాజకీయ జీవితంలో చివరి పార్టీ అవుతుందా లేదా వచ్చే ఎన్నికల్లో ఆమె మళ్లీ పార్టీ మారుతారా అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంది మరి.