Begin typing your search above and press return to search.

రామోజీ ఫిలింసిటీలో షాకింగ్ ప్రమాదం.. ఐటీ సంస్థ సీఈవో దుర్మరణం

అయితే.. భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవటంతోనే ఈ ప్రమాదంలో ఒక ఐటీ సంస్థ సీఈవో మరణించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:55 AM GMT
రామోజీ ఫిలింసిటీలో షాకింగ్ ప్రమాదం.. ఐటీ సంస్థ సీఈవో దుర్మరణం
X

ఒకటికి పదిమార్లు అప్రమత్తంగా ఉండాల్సిన చోట.. చోటు చేసుకునే చిన్న తప్పులకు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ప్రముఖ రామోజీ ఫిలింసిటీలో చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యమని చెబుతున్నా.. అనూహ్య రీతిలోనే ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అయితే.. భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవటంతోనే ఈ ప్రమాదంలో ఒక ఐటీ సంస్థ సీఈవో మరణించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యవసర వేళలో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించాల్సిన అంబులెన్స్ అందుబాటులో లేదని.. ఈ కారణంగానే ఐటీ సంస్థ సీఈవో ప్రాణాలు పోయినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతుంటే.. అందులో నిజం లేదన్న మరో వాదన వినిపిస్తోంది. ఈ విషాద ఉదంతం గురించి విన్నంతనే అయ్యో.. ఇలా జరిగిందా? అన్న భావన కలుగక మానదు. అంచెలంచెలుగా ఎదిగిన ప్రవాస భారతీయుడు కమ్ ఒక ఐటీ సంస్థ (విస్టె్క్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్) సీఈవోగా వ్యవహరిస్తున్న 56 ఏళ్ల సంజయ్ షా ప్రాణాలు పోయాయి. ఇదే ఘటనలో గాయపడిన సదరు ఐటీ సంస్థ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న 52 ఏళ్ల దాట్ల విశ్వనాథ్ అలియాస్ రాజు దాట్ల ఆసుపత్రిలో మ్రత్యువుతో పోరాడుతున్నారు

ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సు కోసం షా సతీమణి ఫిలింసిటీ సిబ్బందిని వేడుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ముంబయికి చెందిన సంజయ్ షా 1989లో అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. పలు ప్రముఖ సంస్థల్లో పని చేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం జాబ్ దిలేసిన ఆయన.. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా విస్టెక్స్ సంస్థను ఏర్పాటు చేశారు

ప్రస్తుతం 20 దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ వార్షిక టర్నోవర్ రూ.3500కోట్లకు పైనే ఉంది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో దీని కార్యాలయం ఉంది. దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కలిదిండి జానకిరామ్ వ్యవహరిస్తున్నారు. సంస్థను ఏర్పాటు చేసి పాతికేళ్లను పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ వేడుకల్ని రామోజీ ఫిలింసిటీలో నిర్వహిచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తమ ఉద్యోగులు.. క్లయింట్లతో వేడుకల్ని నిర్వహించేందుకు వీలుగా ఫిలింసిటీలోని లైమ్ లైట్ గార్డెన్ ను బుక్ చేసుకున్నారు.

రెండు రోజుల పాటు సాగే ఈ ప్రోగ్రాంలను వినూత్నంగా నిర్వహించేందుకు వీలుగా కాంక్రీట్ స్టేజ్ మీద ఉన్న రూఫ్ కు తాళ్లు కట్టి.. వాటికి వేలాడేలా చెక్కతో ఒక ప్లాట్ ఫామ్ తయారు చేశారు. రోప్ సాయంతో కిందకు దిగేలా ప్లాన్ చేశారు.సీఈవో.. ప్రెసిడెంట్ లు 20 అడుగుల ఎత్తులో నిలబడి.. ఆహుతులకు అభివాదం చేస్తూ స్టేజ్ పైకి దిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. రోప్ తాడు తెగిపోవటంతో ప్లాట్ ఫామ్ పక్కకు ఒరిగింది. దీంతో ఇద్దరు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంటు కట్టిన స్టేజీపైన వేగంగా పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని.. దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంజయ్ షా మరణించగా.. విశ్వనాథ్ రాజు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు షా దంపతులు తమ సొంత విమానంలో ముంబయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రామోజీ ఫిలింసిటీకి చేరుకున్నారు. అనూహ్య ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో షా సతీమణి.. ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం ముంబయికి వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.