రామోజీరావు గురించి బాబు మనసులో మాట
ఈ అవార్డుల తొలి ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అతిరధ మహారధులు అంతా హాజరయ్యారు.
By: Satya P | 17 Nov 2025 9:36 AM ISTమీడియా దిగ్గజం రామోజీరావు తెలుగు నాట ఒక సంచలనం. ఆయన గత ఏడాది దివంగతులు అయ్యారు. ఆయన గురించి తెలియని వారు లేరు. మీడియా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన వారుగా చరిత్రపుటల్లో ఎక్కారు. ఏ రోజూ రాజకీయ పదవులు ఆశించలేదు, ఏ అధికార పదవులు అందుకోలేదు. కేవలం తాను నమ్ముకున్న పత్రికారంగం ద్వారానే సమాజానికి మేలు చేశారు. అలాగే సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చో ఆచరణలో చూపించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డులని ఏర్పాటు చేసారు. ఈ అవార్డుల తొలి ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అతిరధ మహారధులు అంతా హాజరయ్యారు.
బాబు ప్రసంగంలో :
రామోజీరావు గురించి బాబు తన మనసులో మాటలను ఇదే వేదిక మీద పంచుకున్నారు. బాబు ఏమి మాట్లాడుతారు అన్నది అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన తన ఉపన్యాసం ద్వారా రామోజీరావుని కొత్త విధంగా ఆవిష్కరించారు. రామోజీరావు లాంటి వారు ఒక పది మంది ఉంటే చాలు సమాజాన్ని ఎంతో బాగు చేయవచ్చు అన్న బాబు మాటలు రామోజీరావు ఏమిటో చెబుతున్నాయి. అంతే కాదు రామోజీకి తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన తలచుకున్నారు. ఆయన వ్యక్తిత్వం ఏమిటో చాటి చెప్పారు.
పోరాట యోధుడంటూ :
రామోజీరావుని పోరాట యోధుడిగా అభివర్ణించారు. ఆయన చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అన్నారు మరో యాభై ఏళ్ళకు ఏమి జరుగుతుందో ముందే ఆలోచించి ఆ దిశగా ప్రణాళికలను తయారు చేసి అమలు చేసిన వారు అని అన్నరు. ఆయన తన ఎంతో మంది సామాన్యులను అసమాన్యులుగా తయారు చేశారు అన్నారు. ఆయనది ఆత్మ విశ్వాసం అని ఆయన దృఢ విశ్వాసమే ఎంతో మందికి స్పూర్తి అని అన్నారు. బలమైన ప్రభుత్వాలతో పోరాడి విజయం సాధించిన వారు రామోజీ అన్నారు.
కష్టం వస్తే :
ఇక తనకు ఏదైనా కష్టం వచ్చినా లేక తనకు ఇబ్బందులు ఎదురైనా రామోజీరావుని తలచుకుంటాను అని దాంతో తనకు ధైర్యం వస్తుందని బాబు చెప్పారు. రామోజీరావు గురించి ఆయన చెప్పిన మనసులో మాట ఇది. ఇక రామోజీరావుతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆయన చెబుతూ తనకు అయినా సరే వ్యతిరేక వార్తలు రాయవద్దు అని చెప్పవద్దు అనేవారు అని బాబు ఆయన గురించి చెప్పడం విశేషం. నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా వెళ్ళే రాజీలేని మనస్తత్వం రామోజీది అని ఆయన అన్నారు. అలా ఆయన ఉండడం వల్ల తన జీవితంలో ఎన్నో ఒత్తిళ్ళను ఎదుర్కొన్నారని అయినా ఎక్కడా తగ్గలేదని బాబు చెప్పారు.
